
బీహార్‌లో కొత్త ప్రభుత్వానికి నేడు విశ్వాస పరీక్ష.. ఫలితం ఖాయం: జేడీయూ
బీహార్‌లో ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి అప్పగించడం గతంలో అందించిన మద్దతుకు ప్రతిఫలంగా తీసుకున్న నిర్ణయమని జేడీయూ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొననుందని తెలిపారు. ఇందుకోసం ఒక్కరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున విశ్వాస పరీక్షలో విజయం ఖాయం అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశీర్వాదంతోనే కొనసాగుతుందని, ఆయన రాజ్యసభకు వెళ్లే నిర్ణయం నేపథ్యంలో సీఎం పదవి నుంచి వైదొలిగారని చెప్పారు.
అధికార మార్పిడి నేపథ్యం
నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం సమ్రాట్ చౌదరి బీహార్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జేడీయూ అధ్యక్షుడు ఉమేష్ కుశ్వాహా మాట్లాడుతూ, అధికార మార్పిడి అంశంపై అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చౌదరి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఎందుకు సీఎం పదవిని వదులుకున్నారు?
జేడీయూ ఎందుకు సీఎం పదవిని కొనసాగించలేదన్న ప్రశ్నకు స్పందించిన చౌదరి ‘బీజేపీ మా పాత మిత్రపక్షం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మా స్థానాలు తగ్గినప్పుడు వారు మాకు మద్దతు ఇచ్చారు. అందుకే ఇప్పుడు వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకోవడం సహజమని, అప్పులపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఆర్జేడీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదని విమర్శించారు.
నిశాంత్ యాత్రపై స్పందన
నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ ప్రారంభించనున్న రాష్ట్ర పర్యటనపై స్పందిస్తూ జేడీయూ యాత్రల ఫలితాలు ప్రజలకు తెలుసు. ఆయన యాత్రను మేము స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధ చట్టంపై కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు వ్యక్తిగతమని, అవి ప్రభుత్వ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. బీహార్‌లో 2016 నుంచి పూర్తి స్థాయి మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, అక్రమ మద్యం కారణంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు కూడా ఈ చట్ట అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది.
