Let's talk: editor@tmv.in
నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు

నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Gaddamidi Naveen
30 జూన్, 2026

భారతదేశ యువత ఎన్నటికీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. నిజమైన జెన్ జీ యువత అంటే తమ కెరీర్‌ను నిర్మించుకుంటూ దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడేవారే కానీ, దేశ రాజ్యాంగాన్ని, సంస్కృతిని ప్రశ్నించేవారు కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం హైదరాబాద్ శివార్లలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి మీదుగా వరంగల్ చేరుకుని, అక్కడ గిరిజన సమాజంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

సదస్సులో హాజరైన కొందరు క్రీడాకారులు, స్టార్టప్ వ్యవస్థాపకులను ఉద్దేశించి నితిన్ నబిన్ మాట్లాడుతూ.. సొంతంగా స్టార్టప్‌లు పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న యువతే నిజమైన జెన్ జీ అని కొనియాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనే టుక్డే టుక్డే గ్యాంగ్ మనస్తత్వంతో విభజన నినాదాలు చేసేవారు ఈ దేశ యువత కాదన్నారు. విదేశీ శక్తుల ప్రేరణతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరగాలని పేర్కొన్న ఆయన, భారత యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, దేశ వ్యతిరేక ధోరణులకు భారత యువతలో స్థానం లేదని అన్నారు. ప్రధాని మోడీ పాలనలో జమ్మూ కాశ్మీర్ యువత రాయి రువ్వే సంస్కృతిని వీడి రంజీ ట్రోఫీలు గెలుచుకునే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం

వరంగల్ బహిరంగ సభలో నితిన్ నబిన్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ కేంద్రమంత్రి దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో తీవ్రంగా పోరాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఢిల్లీలోని తమ అధిష్ఠానం కోసమే పనిచేస్తోందని, రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక పార్ట్‌టైమ్ రాజకీయనాయకుడని, కాంగ్రెస్ ఎప్పుడూ తమ కుటుంబం గురించే ఆలోచిస్తుందని ఆరోపించారు. తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ని కాంగ్రెస్ అవమానిస్తే, మోడీ ప్రభుత్వం ఆయనకు ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించిందన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్లు అందించిన ఘనత కూడా మోడీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ముర్ము ప్రయాణం గిరిజనుల గౌరవానికి ప్రతీక

గిరిజన సదస్సులో నితిన్ నబిన్ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిరోహించిన దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవన ప్రయాణాన్ని అభినందించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం గిరిజన సోదర సోదరీమణుల పోరాటానికి, ఆత్మగౌరవానికి భారతదేశం ఇస్తున్న అత్యున్నత గౌరవానికి ప్రతీక. భారతదేశం గిరిజనుల త్యాగాల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తుందని మోడీ ప్రభుత్వం నిరూపించిందన్నారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా పుట్టిన రాంచీ నా జన్మస్థలం కావడం నా అదృష్టమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రధాని మోడీ ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

యాదాద్రి-భువనగిరి జిల్లాలో పార్టీ కార్యకర్తలు నితిన్ కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పార్టీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్త బీజేపీ కార్యాలయాలను ప్రారంభించడం సంస్థాగత విస్తరణలో కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు మాట్లాడుతూ.. ఈ తొమ్మిది జిల్లాల కార్యాలయాల ప్రారంభం పార్టీ సంస్థాగత విస్తరణలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని, ఇవి కేవలం భవనాలు కావు, కార్యకర్తలకు దేవాలయాలని పేర్కొన్నారు.

అంతకుముందు, వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నితిన్ నబిన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించిన ఆయన, దేశవ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లే, చారిత్రాత్మక భద్రకాళి ఆలయ పురోభివృద్ధికి కూడా బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
NitinNabinBJPTelanganaWarangalHyderabadGenZIndianYouthConstitutionPoliticsTelanganaPoliticsBJP4TelanganaDoubleEngineSarkar
నిజమైన ‘జెన్ జీ’ దేశాన్ని నిర్మిస్తుంది, రాజ్యాంగాన్ని ప్రశ్నించదు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు - Tholi Paluku