Let's talk: editor@tmv.in
సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్ట్
సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్ట్

సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్ట్

Gaddamidi Naveen
23 మే, 2026

రైతుల నుంచి వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కే. కవిత శుక్రవారం సచివాలయం ముట్టడికి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం రైతుల నుంచి వరి, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) ఇతర పంటలను కొనుగోలు చేయడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకునేలా చేయడానికే ఈ నిరసన చేపట్టినట్లు ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వడ్లు, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోవడంతో రైతులు ఆవేదనతో ఉన్నారన్నారు. తీవ్రమైన ఎండలు, ఇతర కారణాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్దే కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర పై రైతులకు ఇవ్వాల్సిన బోనస్ చెల్లింపులను తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. 'సన్న రకం వరికి బోనస్ ఇవ్వాలి', 'రైతుల ప్రాణాలకు విలువే లేదా?' అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని కవిత, టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరిట ఆలస్యం చేస్తూ, తూకంలో తరుగు తీస్తున్నారని ఆరోపించారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ లేదా గ్రేడ్‌లెస్‌గా రిజిస్టర్ చేస్తూ మిల్లర్లు, జిల్లాల్లో కలెక్టర్లు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తెచ్చిన యాప్ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం బుద్ధి తెచ్చుకుని ప్రత్యక్షంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలని, పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ సచివాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలపడం కేవలం శాంపిల్ మాత్రమేనని.. వర్షాలు పడేలోపు కొనుగోళ్లు పూర్తి చేయకపోతే టీఆర్ఎస్ రంగంలోకి దిగుతుందని, అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. అనంతరం నిరసనకారులను పోలీసులు కవితతో పాటు ఇతర నాయకులను సచివాలయం వద్ద అరెస్ట్ చేసి, కవితను ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.