Let's talk: editor@tmv.in
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా

Panthagani Anusha
9 మే, 2026

తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని పనులు చేస్తే, రావలసిన వేతనాలు ఇవ్వకుండా ఒక మంత్రి అనుచరుడు తమను నిలువునా ముంచాడంటూ సుమారు 200 మంది గిరిజన కూలీలు రోడ్డెక్కారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన బాధితులు శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) ఎదుట బైఠాయించి భారీ నిరసన చేపట్టారు.

కోటిన్నర రూపాయల బకాయిలు

బాధితుల కథనం ప్రకారం జి.కొండూరు మండలం, కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజనులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడైన పామర్తి రాజా గత కొంతకాలంగా వివిధ పనులు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి సుమారు రూ. 1.50 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. తమ వేతనాల కోసం గత కొన్ని నెలలుగా రాజా చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోగా బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాక పామర్తి రాజా సదరు మంత్రికి బినామీగా వ్యవహరిస్తున్నారని బాకీ ఉన్న డబ్బులు అడిగితే మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. "మా పొట్ట కొట్టి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు.. మా కష్టార్జితం అడిగితే మమ్మల్ని అవమానిస్తున్నారు" అంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పార్టీ పెద్దలకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు మంగళగిరి రాగా, కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో వారు ప్రధాన గేటు వద్దే బైఠాయించి నినాదాలు చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం ముందే, అది కూడా సొంత మంత్రి అనుచరుడికి వ్యతిరేకంగా గిరిజనులు ధర్నాకు దిగడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రావలసిన రూ. 1.50 కోట్లు చెల్లించేలా చూడాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా - Tholi Paluku