Let's talk: editor@tmv.in
గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Gaddamidi Naveen
6 జూన్, 2026

గిరిజన విద్యార్థులు భయం, సంకోచాలను విడిచిపెట్టి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మార్చి 2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ. లక్ష వరకు వ్యయం చేస్తూ నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ‘తల్లికి వందనం’ పథకంతో పాటు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర అవసరాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నామన్నారు. 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన పార్ధు, 590 మార్కులు సాధించిన జాస్మిన్ తోటివారికి స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడలపై దృష్టి పెట్టాలని, గంజాయి, బెట్టింగ్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

గిరిజన గ్రామాల్లో రహదారుల కోసం రూ. 2,500 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. గంజాయి సాగును నిర్మూలించి, రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నామని, రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ట్రాక్టర్లు అందిస్తున్నామని తెలిపారు. పాములను ముందుగానే గుర్తించే ‘ప్రోటోటైప్ షూ’ రూపొందించి రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన పల్నాడు జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల భర్తీ చేసిన 16 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో 2 వేల పోస్టులు గిరిజనులకు దక్కాయని, జీవో నెం. 3 స్ఫూర్తితో కొత్త విధానాన్ని తెస్తామని స్పష్టం చేశారు.

అధికారుల వెల్లడి – అవార్డుల ప్రదానం

ఎం. మల్లిఖార్జున నాయక్ (కార్యదర్శి):

గిరిజన విద్యార్థులు ఓపెన్ కేటగిరీతో సమానంగా రాణించడం గర్వకారణమని, గురుకులాల్లో ఉత్తీర్ణతను 90 శాతానికి పైగా తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు.

ఎస్. భార్గవి (డైరెక్టర్):

గిరిజన విద్యాభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.1,672 కోట్లు కేటాయించామని, 2,712 విద్యా సంస్థల్లో 2.14 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. 29 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారన్నారు.

ఎం. గౌతమి (కార్యదర్శి):

‘మైల్’ కార్యక్రమం ద్వారా టెన్త్ ఫలితాల్లో 6 శాతం మెరుగుదల నమోదైందని వివరించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రాంగణంలో ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ నాటిన అనంతరం, మొత్తం 176 మంది ప్రతిభావంతులకు (ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 87, గురుకులం నుంచి 89) మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.