Let's talk: editor@tmv.in
ఆక్వాకల్చర్ స్థిరమైన వృద్ధికి పారదర్శక విధానాలే కీలకం: మంత్రి అచ్చెన్నాయుడు

ఆక్వాకల్చర్ స్థిరమైన వృద్ధికి పారదర్శక విధానాలే కీలకం: మంత్రి అచ్చెన్నాయుడు

Gaddamidi Naveen
29 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ (రొయ్యలు, చేపల సాగు) రంగానికి దీర్ఘకాలిక స్థిరత్వం, స్థిరమైన వృద్ధిని చేకూర్చడానికి పారదర్శకమైన విధానాలు, వాటాదారులందరి సమన్వయ సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం స్పష్టం చేశారు.

ఇటీవల ఆక్వా రంగాన్ని వేధిస్తున్న వివిధ సమస్యలపై మంత్రి ఉన్నతాధికారులు, రంగ నిపుణులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. రొయ్యల ఫీడ్‌ ధరల పెరుగుదల, ముడిసరుకుల కొరత, ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఆక్వా రైతులపై పడుతున్న అదనపు ఆర్థిక భారం వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి పంట కాలంలో ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇన్‌పుట్ ఖర్చులు, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల మేత తయారీ పరిశ్రమ కూడా ఇబ్బందుల్లో ఉందన్నారు.

ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, పరిశ్రమ మనుగడను సాగించేలా ప్రభుత్వం ఇరుపక్షాలకు మేలు చేకూర్చే సమతుల్య నిర్ణయాలను తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రంగాన్ని స్థిరీకరించేందుకు అవసరమైన చర్యలను గుర్తించేందుకు ఆక్వా రైతులు, మేత తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులు, సూచనలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో నాణ్యమైన ఫీడ్‌, నాణ్యమైన విత్తనం లభ్యతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇందుకోసం సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. రొయ్యల పిల్లల ఉత్పత్తి కేంద్రాలలో పారదర్శకతను పెంచేందుకు సీసీటీవీ ఆధారిత నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. సీడ్ ట్రేసబిలిటీ మెకానిజమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్‌లను మరింత పటిష్టం చేయడం ద్వారా ఆక్వా రంగంలో క్వాలిటీ కంట్రోల్‌ను పెంచుతామన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక

ఆక్వా రంగానికి అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జెనెటికల్లీ మోడిఫైడ్ సోయా దిగుమతులు, ఫిష్ మీల్ (చేపల పొడి) లభ్యత, దిగుమతి లైసెన్సులు అంతర్జాతీయ మార్కెట్‌లో మన ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం వంటి కీలకాంశాలపై కేంద్రానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు. పారదర్శకమైన పాలన ద్వారా ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, ఎగుమతులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.