Let's talk: editor@tmv.in
ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం

ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం

Panthagani Anusha
28 ఏప్రిల్, 2026

సమాజంలో వివక్షకు గురవుతున్న అణగారిన వర్గాల సాధికారత దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అర్హత ఉన్నా అవకాశాలు దక్కక ఇబ్బంది పడుతున్న తృతీయ ప్రకృతి వ్యక్తులకు (ట్రాన్స్‌జెండర్స్) అండగా నిలుస్తూ ఒక ట్రాన్స్‌పర్సన్‌ను తన వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) నియమించుకున్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజికంగానూ ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

బీ.కాం పూర్తి చేసిన సదరు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిని తన పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేయడంపై ఎమ్మెల్యే మాధవి స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా దగ్గర పని చేయడానికి చాలా మంది వచ్చారు. అయితే లింగం కంటే పని చేసే సామర్థ్యమే నాకు ముఖ్యం. సదరు వ్యక్తి పనితీరు ఎంతో సమర్థవంతంగా ఉంది. పనులను చక్కబెట్టడంలో ఆమె ఎవరికీ తక్కువ కాదని నేను గమనించాను. అందుకే నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించాను అని తెలిపారు. పురుషులు, మహిళలతో సమానంగా ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాజంలో గౌరవం, ఉపాధి దక్కాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె పేర్కొన్నారు.

నాయకత్వానికి అసలైన నిర్వచనం: నారా లోకేష్

ఎమ్మెల్యే మాధవి తీసుకున్న ఈ సాహసోపేతమైన ప్రగతిశీల నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ "ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకోవడం ద్వారా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదర్శంగా నిలిచారు. నాయకత్వం అంటే అణగారిన వర్గాలను శక్తివంతం చేయడమేనని ఆమె నిరూపించారు. ఇది సమాజంలో అవసరమైన గొప్ప మార్పు" అని కొనియాడారు. ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి స్ఫూర్తిదాయక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో సమసమాజ స్థాపన దిశగా ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వివక్షను పక్కన పెట్టి కేవలం విద్యార్హత, సామర్థ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని నియామకం చేపట్టడం పట్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతోంది. ఈ ఘటన ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.