Let's talk: editor@tmv.in
వైద్యఆరోగ్య శాఖలో జీవో-38 ప్రకారమే బదిలీలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

వైద్యఆరోగ్య శాఖలో జీవో-38 ప్రకారమే బదిలీలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
12 మే, 2026

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియను ప్రభుత్వం జారీ చేసిన జీవో 38కు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు, జాయింట్ సెక్రటరీ ఆయేషా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, వైద్య విద్యా సంచాలకుడు నరేందర్ కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీజీడీఏ అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి లాలు ప్రసాద్‌తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో సాధారణ బదిలీల సమయంలో అమలు చేసిన విధంగానే ఈసారి కూడా ఆఫ్‌లైన్ విధానంలో పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని కోరారు. అలాగే టీజీడీఏ పదాధికారులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల సేవ పూర్తి చేసిన వైద్యులను కూడా బదిలీల ప్రక్రియలో చేర్చాలని, జిల్లాల వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వైద్యులకు హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీలకు బదిలీ అయ్యే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.

వైద్యుల సూచనలకు స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారమే బదిలీలను పారదర్శకంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యాల సాధనలో వైద్యుల సంపూర్ణ సహకారం అవసరమని పేర్కొన్నారు.

కళాశాలలు, ఆసుపత్రుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బదిలీల ప్రక్రియ చేపడతామని మంత్రి వివరించారు. పరిపాలన, బోధన, వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాల వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వైద్యులకు కూడా ఈ బదిలీలలో తగిన అవకాశం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.