
వరంగల్‌లో మొబైల్ నెట్‌వర్క్ పనితీరుపై ‘ట్రాయ్’ నివేదిక
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ తెలంగాణలోని వరంగల్ నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన మొబైల్ నెట్‌వర్క్ నాణ్యత పరీక్షల వివరాలను వెల్లడించింది. మార్చి 23 నుంచి 25 వరకు ట్రాయ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ టెస్టులు జరిగాయి.
మొత్తం 375.3 కిలోమీటర్ల మేర వరంగల్ నగరంతో పాటు 8 ప్రధాన హాట్‌స్పాట్ ప్రాంతాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. పట్టణ మండలాలు, విద్యా సంస్థలు, గ్రామీణ నివాస ప్రాంతాలను కలుపుతూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్ పనితీరును విశ్లేషించారు. కాజీపేట, హన్మకొండ, సుబేదారి, మామ్నూరు, మడికొండ, ఘన్‌పూర్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చారు.
వాయిస్ సేవల పనితీరు
కాల్ సెటప్ సక్సెస్ రేట్ పరంగా అన్ని నెట్‌వర్క్‌లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఎయిర్‌టెల్ 100 శాతం సక్సెస్ రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. వోడాఫోన్ ఐడియా 99.08 శాతం, రిలయన్స్ జియో 97.95 శాతం, బిఎస్ఎన్ఎల్ 96.11శాతంగా నమోదయ్యాయి.
డేటా సేవల వేగం
డేటా డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో 5జీ సేవలలో జియో, ఎయిర్‌టెల్ భారీ వేగాన్ని నమోదు చేశాయి. జియో సగటున 260.01ఎంబీపీలు డౌన్‌లోడ్ వేగంతో ప్రథమ స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 161.18 ఎంబీపీలు వేగంతో రెండో స్థానం. వోడాఫోన్ ఐడియా 27.83 ఎంబీపీలు వేగాన్ని నమోదు చేయగా, బిఎస్ఎన్ఎల్ కేవలం 8.32 ఎంబీపీలు వేగానికి పరిమితమైంది.
వరంగల్ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, కాకతీయ మెడికల్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ, ఎంజీఎం ఆసుపత్రి, నిట్ వరంగల్, వరంగల్ రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో స్థిరంగా ఉండే వినియోగదారుల అనుభవాన్ని ట్రాయ్ బృందం ప్రత్యేక్షంగా అంచనా వేసింది. ఈ ఫలితాలను సంబంధిత టెలికాం ఆపరేటర్లకు పంపినట్లు ట్రాయ్ తెలిపింది. నెట్‌వర్క్ నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఈ నివేదిక దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ట్రాయ్ అధికారిక వెబ్‌సైట్ www.trai.gov.in ని సందర్శించవచ్చు.
