Let's talk: editor@tmv.in
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం

Dantu Vijaya Lakshmi Prasanna
24 ఏప్రిల్, 2026

రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషాదానికి దారితీసింది. నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఇవాళ ఉదయం పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడాని మీడియాలో వార్తలు వచ్చాయ. కానీ ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారయి. ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగుస్తుందని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. శంకర్‌‌గౌడ్‌ త్యాగాన్ని వృథా కానివ్వం అంటూ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసింది. సమ్మె ఉదృతమవుతుందని పేర్కోంది.

సామాన్య ప్రజానీకం ఇబ్బంది

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తమ 32 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సమ్మెకు దిగడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో గురువారం నాటికి పరిస్థితి మరింత జటిలమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులు పట్టుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. సమ్మె కారణంగా కేవలం 25 నుంచి 30 శాతం బస్సులు మాత్రమే రోడెక్కాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లను, ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి దింపినప్పటికీ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలు అందడం లేదు.

ప్రజా రవాణాపై ఆధారపడే సామాన్య ప్రజలకు ఈ సమ్మె శాపంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు సామాన్యుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ, బస్సులు లేకపోవడంతో ఆ ప్రయోజనం అందడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.

సర్కార్ హామీల ఉల్లంఘన.. రగులుతున్న నిరసన జ్వాలలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా వాటిని బుట్టదాఖలు చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకుని, గవర్నర్ ఆమోదం కూడా పొందినప్పటికీ, ప్రస్తుత సర్కార్ కేవలం 'అపాయింట్ డేట్' ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ జాప్యం వెనుక సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర దాగి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

పోలీస్ పహారాలో ప్రజా రవాణా - నిరంకుశత్వానికి పరాకాష్ట

ప్రజాపాలన అని చెప్పుకుంటూనే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ పరిధిలోని తాండూరులో సమ్మె చేస్తున్న కార్మికులకు టెంట్ సామాన్లు కూడా ఇవ్వకూడదని పోలీసులు నోటీసులు జారీ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జనగామలో దయనీయ స్థితి - కార్మికుల ఆవేదన

జనగామ జిల్లా కేంద్రంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను బలవంతంగా అడ్డుకుని, భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలాగా పెట్టి మరీ బస్సులు నడపడం చూస్తుంటే ప్రభుత్వం కార్మికుల పట్ల ఎంత మొండిగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. తమ పొట్ట కొట్టవద్దని, బస్సులు నడిపి సమ్మెను విచ్ఛిన్నం చేయవద్దని పోలీసులు, అధికారుల కాళ్ల మీద పడి కార్మికులు ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి.

ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌‌

మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టించగా, సగం పైగా గాయపడిన అతన్ని తోటి కార్మికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే 80% కాలిన గాయాలతో ఉన్న అతన్నిగ్రీన్ ఛానెల్ ద్వారా వరంగల్ ఎంజీఎం నుండి హైదరాబాద్ తరలిస్తుండగా, నగరానికి చేరుకునేలోపు శంకర్ గౌడ్ మృతి చెందినట్టు సమాచారం.

అలాగే, భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లింగారెడ్డి ఖమ్మంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నం చేయగా.. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉంది.

మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలు డిపోలకు చెందిన వెల్ఫేర్ బోర్డు ప్రతినిధులు తమ పదవులకు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఈ ఉద్యమం మరింత ముదిరినట్లయింది.

మహబూబ్ నగర్ డిపో వద్ద నిర్వహించిన మహాధర్నాలో జేఏసీ నాయకులు కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా వాటిని విస్మరించి కార్మికులను మోసం చేశారని జి. లక్ష్మణ్ గౌడ్, సాయిరెడ్డి, విజయబాబులు ఆరోపించారు. సంస్థలో రోజువారీ ఆదాయ లక్ష్యాల పేరుతో వేధింపులు పెరిగాయని, ఉదయం నుంచి అర్థరాత్రి వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తూ తీవ్రమైన పనిభారంతో కార్మికులు కుంగిపోతున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

మోసపూరిత హామీలపై పోరాటం

ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు మాట మార్చి మభ్యపెడుతోందని కార్మికులు ధ్వజమెత్తుతున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, తక్షణమే విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 29 డిమాండ్లకు అంగీకరించామని చెబుతున్నా, అత్యంత కీలకమైన విలీనం, పే-స్కేల్ వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం వల్లే సమ్మెను ఉధృతం చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. డిపోలన్నీ కార్మికుల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.

సకల జనుల సమ్మె హెచ్చరిక

ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేస్తే, రాబోయే రోజుల్లో 2011 నాటి 'సకల జనుల సమ్మె' తరహాలోనే మరో భారీ పోరాటానికి సిద్ధమవుతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం పంతానికి పోవడం సరికాదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. కేవలం పోలీసు బలగాలతో బస్సులు నడిపించి సంస్థను నడపలేరని, కార్మికుల కడుపు మండితే సర్కార్ కూలిపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాల్సిన సమయం

ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కావడం, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రైవేట్ డ్రైవర్లను నియమించి తాత్కాలికంగా బస్సులు నడిపినప్పటికీ, అది శాశ్వత పరిష్కారం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మొండివైఖరి వీడి, ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు వేయాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్‌ఎస్ మద్దతు:

రాజకీయంగా ఈ సమ్మె సెగలు రేపుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించింది. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. పేదల జీవనాడి అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు బీజేపీ నేతలు కూడా సంఘీబావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు తన మద్దతు తెలిపారు.

ఇదిఇలా ఉంటే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మెపై స్పందిస్తూ.. కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేవలం మూడు డిమాండ్ల విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విలీనం, యూనియన్ ఎన్నికల అంశాలపై లోతైన చర్చలు అవసరమని వివరించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుపై మంత్రి మండిపడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీసీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నా కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లపై అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారుల కమిటీకి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని స్పష్టం చేశారు. డిమాండ్లన్నీ ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నవని, ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు ఓపిక పట్టాలని కోరారు. అయితే అధికారుల కమిటీ ప్రతిపాదనను కార్మిక జేఏసీ నాయకులు తిరస్కరించారు. ఇప్పటికే కాలయాపన జరిగిందని, తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమ్మె సుదీర్ఘంగా కొనసాగితే రాష్ట్ర రవాణా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే రెండు రోజులుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలని కార్మికులు, కార్మికులు ప్రజల ఇబ్బందులు గమనించాలని ప్రభుత్వం పరస్పరం కోరుకుంటున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీని అరికట్టాలని సామాన్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రభుత్వం కార్మిక సంఘాలతో తిరిగి చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కారం కనుగొనకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

ప్రభుత్వం చర్చలకు పిలుపు

కాగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నేడు డిప్యూటీ సీఎం కార్మిక సంఘాలతో భేటీ అవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు.