
పల్నాడులో విషాదం: కృష్ణా నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పరిధిలో ఆదివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్న సాధారణ చేపల వేట పడవ బోల్తా పడి నలుగురు వ్యక్తులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.10 మంది బంధువులు కోనూరులో జరిగే ఓ వేడుకకు పడవపై వెళ్లి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడటంతో వారంతా నీట మునిగిపోయారు. వీరిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు.
సత్తెనపల్లి డీఎస్‌పీ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. నది ఒడ్డుకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో, పిల్లలంతా ఒక్కసారిగా పడవలో ఒకే వైపునకు కదలడంతో బ్యాలెన్స్ తప్పి పడవ బోల్తా పడింది. నది ఒడ్డుకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో నీటి లోతు ఎక్కువగా ఉండటమే ఈ ప్రాణనష్టానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
