
మహారాష్ట్రలో మంత్రి ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మహిళా ఆగ్రహం
దక్షిణ ముంబైలో మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిర్వహించిన బీజేపీ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో ఓ మహిళ మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహజన్‌ను బహిరంగంగా నిలదీశారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. మంత్రి ఆమె కోపం సమంజసమేనని అంగీకరించినప్పటికీ, మాట్లాడిన భాష తగలేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముంబై మేయర్ రీతూ తావ్డే పౌరులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు.
మంగళవారం వోర్లీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, మహిళ తీవ్ర ఆగ్రహంతో ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి… ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. సమీప మైదానంలో సభ పెట్టొచ్చుకదా? అంటూ మంత్రిని ప్రశ్నించారు. మహాజన్ ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించినా, ఆమె మళ్లీ వచ్చి ‘అర్థం కాలేదా? వందల మంది ఇక్కడ వేచి ఉన్నారంటూ తీవ్రంగా స్పందించారు. పోలీసులు జోక్యం చేసుకున్నా, వారితో మాట్లాడటానికీ నిరాకరించారు.
వైరల్ చేసిన కాంగ్రెస్ నేత
ఈ వీడియోను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘటన మరింత వైరల్ అయింది. బీజేపీ మహిళలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
బుధవారం స్పందించిన మహాజన్ వేలాది మహిళలు పాల్గొనడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది తప్పలేదు. ఆమెకు అక్కడే క్షమాపణ చెప్పాను. పోలీసులకు కూడా ఆమెపై చర్యలు తీసుకోవద్దని చెప్పాను. ఆమె తన బిడ్డను తీసుకురావడానికి తొందరలో ఉన్నారు కాబట్టి కోపం కొంతవరకు సమంజసం. కోపంలో బాటిల్ కూడా విసిరారు అని చెప్పారు. 15–20 వేల మహిళలు పాల్గొన్నందున కొంత రద్దీ అనివార్యమైందని, ‘వీఐపీ కల్చర్’ ఆరోపణలను తిరస్కరించారు.
మేయర్ రితు తావ్డే ఎక్స్‌లో చేసిన ప్రకటనలో, అవసరమైన అనుమతులతోనే ‘మహిళ జనాక్రోశ్ మోర్చా’ నిర్వహించామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, రవాణా శాఖ ముందస్తు ప్రణాళికలు చేశాయని పేర్కొన్నారు. దక్షిణ ముంబైలో కోస్టల్ రోడ్, ఫ్లైఓవర్లు, సిమెంట్ రోడ్ల వంటి పనులు ట్రాఫిక్‌ను తగ్గించాయని కూడా తెలిపారు.
ఇక ప్రతిపక్షం ఈ ఘటనను బీజేపీపై విమర్శలకు ఆయుధంగా మలిచింది. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ముంబై ప్రజల రోజువారీ ట్రాఫిక్ కష్టాలను పాలకులు పట్టించుకోవడం లేదు. ఆ మహిళ మంత్రి కి అద్దం పట్టిందని విమర్శించారు. పీక్ అవర్స్‌లో రోడ్లపై నిరసనలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ముంబై కాంగ్రెస్ నేత వర్ష గైక్వా డ్ కూడా స్పందిస్తూ ఇదే నిజమైన మహిళా శక్తి. ప్రచారం కోసం ముంబై ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని వ్యాఖ్యానించారు.
