Let's talk: editor@tmv.in
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కఠిన పరీక్షే: అమెరికా

భారత్‌తో వాణిజ్య ఒప్పందం కఠిన పరీక్షే: అమెరికా

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడం అంత సులభం కాదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ స్పష్టం చేశారు. భారత్ తన ప్రయోజనాల విషయంలో రాజీపడదని, ఆ దేశంతో చర్చలు జరపడం కఠినమైన సవాలు' అని ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు భారత్-అమెరికా ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు బుధవారం ముగిసిన నేపథ్యంలో గ్రీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వ్యవసాయ రంగమే ప్రధాన అడ్డంకి!

అమెరికా కాంగ్రెస్‌లోని కమిటీ ఆన్ వేస్ అండ్ మీన్స్ ముందు గ్రీర్ మాట్లాడుతూ.. భారత్ చాలా కాలంగా తన వ్యవసాయ మార్కెట్లను ఇతర దేశాల పోటీ నుంచి రక్షిస్తోందని పేర్కొన్నారు. తాజా వాణిజ్య ఒప్పందంలోనూ భారత్ తన రైతు ప్రయోజనాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ముఖ్యంగా పశుగ్రాసంగా వాడే డీడీజీలు (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్), సోయాబీన్ మీల్, ఇథనాల్ వంటి వస్తువుల ఎగుమతులపై అమెరికా ఆసక్తి చూపుతుండగా.. భారత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే కొన్ని విభాగాల్లో మాత్రం పరస్పర అంగీకారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పట్టువీడని భారత ప్రతినిధుల బృందం

ఈ చర్చల్లో భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం చురుగ్గా పాల్గొంది. అమెరికా తరఫున బ్రెండన్ లించ్ బృందం చర్చలు జరిపింది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్న భారత్.. అమెరికా మార్కెట్లలో తమ ఉత్పత్తులకు రాయితీలతో కూడిన ప్రవేశాన్ని కోరుతోంది. తమ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఒప్పందంలోని ప్రతి నిబంధనను భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

ఒప్పందం నేపథ్యం.. అడ్డంకిగా మారిన కోర్టు తీర్పు

ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అసలు ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. ఫిబ్రవరి 7న ఒప్పంద ముసాయిదాను కూడా విడుదల చేశారు. దీని ప్రకారం భారత్ నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై విధించిన అదనపు సుంకాలను కూడా తొలగించేందుకు సిద్ధమైంది.

అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు పరిస్థితిని మార్చివేసింది. ట్రంప్ హయాంలో విధించిన పరస్పర సుంకాలను కోర్టు తప్పుపట్టడంతో, ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. తమ ప్రయోజనాలకు గండిపడకుండా ఒప్పందాన్ని మళ్లీ రాయాలని భారత్ కోరుతోంది. అమెరికా మార్కెట్లలో తమ వస్తువులకు ప్రాధాన్యత లభించాలని భారత్ గట్టిగా పట్టుబడుతోంది. అటు అమెరికా తన ఎగుమతుల కోసం భారత్‌పై ఒత్తిడి తెస్తున్నా, తమ దేశీయ ప్రయోజనాలను, ముఖ్యంగా రైతుల శ్రేయస్సును పణంగా పెట్టేందుకు భారత్ సిద్ధంగా లేదని తాజా చర్చల ద్వారా స్పష్టమవుతోంది. ఈ క్రమంలో రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన మధ్యేమార్గం కోసం కసరత్తు కొనసాగుతోంది.