Let's talk: editor@tmv.in
ములుగు గుట్టల్లో.. 10 వేల ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు గుర్తింపు
ములుగు గుట్టల్లో.. 10 వేల ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు గుర్తింపు
ములుగు గుట్టల్లో.. 10 వేల ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు గుర్తింపు
ములుగు గుట్టల్లో.. 10 వేల ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు గుర్తింపు

ములుగు గుట్టల్లో.. 10 వేల ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు గుర్తింపు

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

తెలంగాణలోని గుట్టలు, అడవులు చరిత్ర పూర్వ యుగానికి చెందిన విలువైన ఆనవాళ్లను వెలికితీస్తూనే ఉన్నాయి. తాజాగా ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని గుట్టల్లో రాతి యుగాలకు చెందిన అరుదైన రాక్ ఆర్ట్ (రాతి చిత్రాలు), బృహత్ శిలా యుగపు డాల్మెన్ సమాధులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆవిష్కరణతో తెలంగాణ ప్రాచీన చరిత్రలో మరో కీలక అధ్యాయం చేరింది.

ఈ అరుదైన చారిత్రక ఆనవాళ్లను పబ్లిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) సభ్యులు గడ్డం క్రాంతి కుమార్, తాటి సాంబశివరావు దొర గుర్తించారు. వీరు ప్రిహా జనరల్ సెక్రటరీ, సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.ఏ. శ్రీనివాసన్ నేతృత్వంలో ఈ అన్వేషణను చేపట్టారు.

ములుగు పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని బండ్లపహాడ్ అటవీ ప్రాంతంలో ఉన్న మొద్దుగుట్ట, దర్వాజాల గుట్ట, నెమలిగుట్ట ప్రాంతాల్లో ఈ రాతి చిత్రాలు గుర్తించారు. స్థానికులు పిలిచే ఈ గుట్టల రాతి గోడలపై చరిత్ర పూర్వ యుగానికి చెందిన అనేక చిత్రాలు కనిపించాయి.

డా. ఎం.ఏ. శ్రీనివాసన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిత్రాల్లో మానవాకృతులు, జింకలు, ఎద్దులు, తాబేళ్లు, నక్కలు, అడవి దున్నలను పోలిన జంతువుల బొమ్మలతో పాటు గీతలు, జ్యామితీయ ఆకృతులు, అలంకార నమూనాలు కనిపిస్తున్నాయి. వీటిలో అధిక భాగం ఎరుపు రంగుతో, కొన్ని తెలుపు రంగుతో చిత్రించబడ్డాయి. ప్రకృతి ప్రభావంతో కొన్ని చిత్రాలు మసకబారినప్పటికీ వాటి శైలి ఆధారంగా ఇవి మధ్య రాతియుగం, కొత్త రాతియుగం, బృహత్ శిలాయుగాలకు చెందినవిగా భావిస్తున్నారు. అంటే సుమారు 10 వేల నుంచి వెయ్యి సంవత్సరాల క్రితం మధ్యకాలానికి చెందినవిగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొద్దుగుట్టలో అత్యంత అరుదైన మానవాకృతులు

ఈ గుట్టల్లో అత్యంత విశేషంగా గుర్తించినవి మొద్దుగుట్టలో కనిపించిన రెండు భారీ మానవాకృతి చిత్రాలు. ఎరుపు, తెలుపు రంగుల్లో చిత్రించిన ఈ బొమ్మల్లో ప్రత్యేకమైన తల ఆకృతులు, శరీర అలంకరణలు కనిపిస్తున్నాయి.

ఒక మానవాకృతి నిలువుగా ఉండగా, దాని శరీరమంతా అలంకార నమూనాలతో నిండి ఉంది. మరో చిత్రం అడ్డంగా ఉండి, తల, మెడ భాగాల్లో ప్రత్యేకమైన డిజైన్లు ఉన్నాయి. వీటిపై ఒకదానిపై మరొకటి చిత్రించినట్లు కనిపించే సూపర్ ఇంపోజింగ్ శైలి కూడా గుర్తించారు.

తాడ్వాయి సమీపంలోని బొమ్మల లొద్దిలో ఇలాంటి మానవాకృతులు ఉన్నప్పటికీ, మొద్దుగుట్టలో కనిపించిన చిత్రాలు మరింత కళాత్మకంగా, అధిక అలంకరణలతో ఉండటం విశేషమని డా. శ్రీనివాసన్ తెలిపారు.

దర్వాజాల గుట్ట, నెమలిగుట్టలో ప్రత్యేక చిత్రాలు

దర్వాజాల గుట్టలో తాబేళ్ల చిత్రాలు, తెల్లటి అలంకార నమూనాలు, ఎరుపు రంగు బొమ్మలు గుర్తించారు. ఇక్కడ కూడా సూపర్ ఇంపోజింగ్ శైలి స్పష్టంగా కనిపిస్తోంది.

నెమలిగుట్టలో తెలుపు రంగుతో గీసిన జింకలు, ఎద్దుల చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే ప్రాంతంలో మూడు బృహత్ శిలాయుగపు డాల్మెన్ సమాధులు కూడా ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రాచీన మానవ నివాస కేంద్రంగా ఉండి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

గుహ, కప్ మార్క్స్ కూడా గుర్తింపు

మొద్దుగుట్టలో మరో విశేషం కూడా బయటపడింది. గుట్ట మధ్యలో సుమారు నాలుగు మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తు, పదిహేను మీటర్ల పొడవు గల సహజ గుహను గుర్తించారు. ప్రస్తుతం ఇది గబ్బిలాల నివాసంగా ఉంది. గుహ సమీపంలోని రాళ్లపై కనిపించిన కప్ మార్క్స్, కొత్త రాతియుగానికి చెందిన గ్రూవ్స్ (బొద్దులు) ఈ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితమే మానవ నివాసాలు ఉన్నాయనే విషయాన్ని బలపరుస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

ప్రత్యేకమైన చిత్రాలుగా నిపుణుల అభిప్రాయం

చరిత్ర పూర్వ రాతి చిత్రాల నిపుణుడు బండి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తరహా అలంకార మానవాకృతులు ఇప్పటివరకు తెలంగాణలో గుర్తించలేదన్నారు. మధ్య శిలాయుగం నుంచి కొత్త రాతియుగం, బృహత్ శిలాయుగం వరకు ఈ ప్రాంతంలో నిరంతర మానవ జీవనం కొనసాగినట్లు ఈ చిత్రాలు సూచిస్తున్నాయని చెప్పారు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

ములుగు జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన బృహత్ శిలాయుగపు సమాధులు, తాజాగా గుర్తించిన ఆరు గుట్టల రాక్ ఆర్ట్ ప్రాంతాలను ఒకే వారసత్వ కేంద్రంగా అభివృద్ధి చేసి పరిరక్షించాలని డా. శ్రీనివాసన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ములుగు జిల్లా అంతర్జాతీయ స్థాయి చారిత్రక, పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.

స్థానిక యువకులకు శాస్త్రీయ పురావస్తు పరిశోధనలో శిక్షణ ఇస్తే తెలంగాణ అడవులు, గుట్టల్లో మరిన్ని చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని ప్రిహా సంస్థ అభిప్రాయపడింది.

1990 నుంచి కొనసాగుతున్న అన్వేషణ

ములుగు జిల్లాలో తొలిసారిగా 1990లో తాడ్వాయి మండలంలోని నర్సాపూర్ గ్రామ పరిసరాల్లోని కొస్సెగుట్ట, బొమ్మల లొద్ది ప్రాంతాల్లో రాతి యుగపు చిత్రాలను తెలంగాణ పురావస్తు శాఖకు చెందిన ఎస్.ఎస్. రంగాచారి గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం ఆరు గుట్టల్లో ఇటువంటి రాక్ ఆర్ట్ వెలుగులోకి వచ్చింది.

పురావస్తు శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.ఎస్. రంగాచారి మాట్లాడుతూ, బాసర నుంచి భద్రాచలం వరకు చరిత్ర పూర్వ యుగానికి చెందిన అనేక విలువైన ఆనవాళ్లు విస్తరించి ఉన్నాయని, వాటి అన్వేషణ, పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.

ట్యాగ్‌లు
MuluguMuluguDistrictRockArtRockPaintingsPrehistoricArtStoneAgeTelanganaHistoryArchaeologyArchaeologicalDiscoveryAncientIndiaHeritageDolmensMegalithicTelanganaTourismMuluguTourismHistoryNewsAncientCivilizationCaveArtTelanganaNewsBreakingNews