
పర్యాటక కేంద్రాలను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, మన రాష్ట్ర వనరులే మనకు పెట్టుబడి అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని పర్యాటక రంగ సంభావ్యతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఆస్తులను సమర్థవంతంగా వాడుకుంటూ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటక రంగాన్ని అద్భుతంగా వాడుకుంటూ ఉపాధిని, జీడీపీ వృద్ధిని సాధిస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణలోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న పర్యాటక ఆస్తులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసి సంపదను సృష్టించాలని భట్టి విక్రమార్క సూచించారు. దీని కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను, విధానపరమైన అంశాలను కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం విభాగాల్లో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లాలన్నారు. అలాగే వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని నిర్దేశించారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం
లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక మేటల తొలగింపు పనులను సబ్ కమిటీ సమీక్షించింది. చట్టపరమైన నిబంధనలను పాటించే క్రషర్ ఆపరేటర్లకు అనుమతులు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నది ఇసుకతో పోలిస్తే రోబో సాండ్ తక్కువ ధరకే లభిస్తోందని కమిటీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో, పొరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో భూముల విలువల సవరణ సానుకూల ఫలితాలను ఇస్తోందని, దీనివల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు కమిటీకి వివరించారు. రవాణా శాఖలో ఆదాయ వృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగింది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ల పన్ను విధింపుపై కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పును కమిటీ ప్రస్తావించింది. ఈ వాహనాల పన్ను విధింపు విధానాలపై చర్చించేందుకు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే, పరిశ్రమల శాఖ పరిధిలోని పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అంశాలపై కూడా సమీక్షించారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక్, టిఎమ్‌డిసి విసి & ఎండి అనుదీప్ దురిశెట్టి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
