

రూ.65 కోట్లతో ‘భువనగిరి కోట’ పర్యాటకాభివృద్ధి : మంత్రి జూపల్లి కృష్ణారావు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రాత్మక భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి కోట పరిధిలో సాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక రోప్‌వే, హోటల్, పార్కింగ్ వసతులు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫెటేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, ఇతర పర్యాటక సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భువనగిరి కోటను దాని పురాతన వైభవం ఉట్టిపడేలా రూ.65 కోట్లతో అధునాతనంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. కేరళలోని ప్రసిద్ధ 'జటాయువు నేచర్ పార్క్' మాదిరిగా భువనగిరిని కూడా అద్భుత పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక పర్యాటక హబ్‌గా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
యాదాద్రి, కొలనుపాక, భువనగిరి కోట, స్వర్ణగిరి వంటి ప్రముఖ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలతో పోటీపడేలా తీర్చిదిద్దుతాం. పర్యాటక రంగం బలోపేతం కావడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు మన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. కోట యొక్క చారిత్రక వైభవాన్ని దెబ్బతీయకుండా భువనగిరి ఖిల్లాను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి, భువనగిరి ఖిల్లా, కొలనుపాకలను కలుపుతూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్ ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. పనులన్నింటినీ అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే 24 గంటల పాటు నిరంతరాయంగా పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ. 56.81 కోట్ల నిధులు
కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్ల వ్యయంతో “భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియెన్షియల్ జోన్” ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇందులో రూ.17.91 కోట్లతో సుమారు 1,020 మీటర్ల పొడవు, 180 మీటర్ల ఎత్తు వ్యత్యాసంతో మోనోకేబుల్ జిగ్‌బ్యాక్ విధానంలో ప్రయాణికుల రోప్‌వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరు క్యాబిన్లు, ఒక రిజర్వ్ క్యాబిన్‌తో గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఈ రోప్‌వేకు ఉంటుంది.
వారసత్వ కట్టడాల పునరుద్ధరణ & మౌలిక వసతులు (రూ. 38.90 కోట్లు)
రోప్‌వే లోయర్ స్టేషన్ పరిధిలోని 2.9 ఎకరాలలో అంతర్గత రోడ్లు, పార్కింగ్, డ్రైనేజీలు నిర్మిస్తారు. పర్యాటకుల కోసం 20 ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కొత్త టాయిలెట్ బ్లాకులు, ఫుడ్ కియోస్క్‌లు, వీక్షించే గ్యాలరీలు, కేఫెటేరియా, మెట్లను చదును చేసే పనులు చేపడతారు. గుట్టపై ఉన్న పురాతన కట్టడాలను పునరుద్ధరించి, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌పై టెన్సైల్ రూఫ్ ఏర్పాటు చేస్తారు.
కోట అంతటా విద్యుద్దీకరణ, వీధి దీపాలు, బయో డైజెస్ట్ ట్యాంకులు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. పర్యాటకుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు, ఎక్స్-రే బ్యాగేజ్ స్కానింగ్ వంటి గట్టి నిఘా చర్యలు చేపడుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ పర్యవేక్షణకు ప్రత్యేక ఆపరేషన్ టీమ్‌తో పాటు 3 ఏళ్ల సమగ్ర నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
