Let's talk: editor@tmv.in
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

Panthagani Anusha
9 మే, 2026

రాష్ట్రంలో పొగాకు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మార్కెట్‌లో ధరల పతనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టంగుటూరు పొగాకు బోర్డు కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నిరసనను ఉద్దేశించి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రైతులు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం సరికాదని ఆయన విమర్శించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రైతుల సమస్యల పరిష్కారం కోసం తాము ఎప్పుడూ ముందుండి పోరాడతామని ఆయన భరోసా ఇచ్చారు.

కాగా ప్రభుత్వం తక్షణమే స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ప్రకటించి న్యాయం చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అవసరమైతే కఠినమైన పోరాటాలకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులు మరియు వందలాది మంది రైతులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.