
బెంగాల్‌లో టీఎంసీ అరాచక పాలన: రాజ్‌నాథ్ సింగ్
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లక్ష్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. సోమవారం బీర్భూమ్ జిల్లాలోని సైంథియాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ మమతా బెనర్జీ హయాంలో రాష్ట్రం అవినీతి, అశాంతి, బంధుప్రీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సామాన్యులకు రక్షణ కరువైందని ఆయన మండిపడ్డారు.
మహిళా రక్షణకు 'దుర్గా స్క్వాడ్'
రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా “దుర్గా స్క్వాడ్”ను ఏర్పాటు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా ఈ విభాగం పనిచేస్తుందని, ఆడబిడ్డలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీఎంసీ పాలనలో నేరగాళ్లకు లభిస్తున్న రాజకీయ ఆశ్రయం వల్లే మహిళలు వీధుల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
ఉద్యోగులకు వరం.. నిరుద్యోగులకు భరోసా
ప్రభుత్వ ఉద్యోగులు, యువతను ఆకట్టుకునేలా రాజ్‌నాథ్ పలు వరాలు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర నెలల్లోనే (45 రోజులు) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగితపై స్పందిస్తూ రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రతి ఏటా ఒక లక్ష మంది యువతకు ప్రభుత్వ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. టీఎంసీ వైఫల్యాల వల్ల బెంగాల్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధికి అడ్డంకిగా టీఎంసీ
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే బెంగాల్ మాత్రం వెనుకబడిపోతోందని రాజ్‌నాథ్ విమర్శించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకుండా జాప్యం చేస్తోందని ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆరోపించారు. చొరబాటుదారులను అరికట్టడంలో టీఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.
సంక్షేమ పథకాలపై హామీలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని బెంగాల్ ప్రజలకు అందకుండా మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ విజయం సాధిస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు చేపల ఉత్పత్తిలో బెంగాల్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదు భయానికి, భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటం. అవినీతిని సాగనంపి అభివృద్ధిని ఎంచుకోవాలని రాజ్‌నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలోని చీకటి తొలగి 'కొత్త బెంగాల్' ఆవిర్భవిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
