


టీఎంసీ మహిళలకు ద్రోహం చేసింది: ప్రధాని మోడీ
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మహిళా సాధికారతకు తూట్లు పొడుస్తూ వారికి తీరని ద్రోహం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఆదివారం బంకురా జిల్లా బిష్ణుపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 (మహిళా రిజర్వేషన్లు) ఆమోదం పొందకుండా టీఎంసీ, కాంగ్రెస్‌లు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లును వ్యతిరేకించిన టీఎంసీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకుండా టీఎంసీ అడ్డుకుందని మోడీ ఆరోపించారు. "బీజేపీ అంటే మహిళా భద్రత, సాధికారతకు మారుపేరు. కానీ బెంగాల్ మహిళలు పెద్ద సంఖ్యలో చట్టసభలకు రావడం మమతా బెనర్జీకి ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఈ బిల్లును అడ్డుకున్నారు" అని విమర్శించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే, మరోవైపు మత ఆధారిత రిజర్వేషన్లను ప్రోత్సహిస్తూ టీఎంసీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాజంగల్ రాజ్‌ను ఎదిరిస్తున్న నారీ శక్తి
పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం 'మహాజంగల్ రాజ్' నడుస్తోందని, దీనిని సవాలు చేస్తున్న మహిళలను ఇరకాటంలో పెట్టడమే టీఎంసీ లక్ష్యమని మోడీ పేర్కొన్నారు. చొరబాటుదారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రతి చట్టాన్ని ఉల్లంఘించే మమత ప్రభుత్వం, సొంత రాష్ట్ర మహిళల హక్కులను మాత్రం కాలరాస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులు, సిండికేట్ గూండాల ఆగడాలకు మహిళలే బాధితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన వ్యతిరేక వైఖరిపై ధ్వజం
టీఎంసీకి ఆదివాసీలన్నా, గిరిజనులన్నా గౌరవం లేదని ప్రధాని విమర్శించారు. దేశ తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా అవమానించాయని గుర్తు చేశారు. "టీఎంసీ గిరిజన కుమార్తెలను, సోదరీమణులను ద్వేషిస్తోంది. కానీ బీజేపీ గిరిజన సాధికారతకు కట్టుబడి ఉంది" అని స్పష్టం చేశారు. అలాగే కుర్మీ సామాజిక వర్గం సమస్యలను విస్మరించి, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఎంసీ పాకులాడుతోందని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే వరాల జల్లు
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే మహిళల కోసం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అడ్డుకుంటున్న 'నిర్మమ్ సర్కార్'కు కాలం చెల్లిందని, ఆయుష్మాన్ భారత్ కింద మహిళలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 1.5 లక్షల సాయం, గర్భిణీలకు రూ. 21,000, బిడ్డ పుట్టినప్పుడు రూ.5,000, బాలికల చదువు కోసం రూ.50,000 అందజేస్తామని ప్రకటించారు. పేదలకు ఉచిత రేషన్ పథకం నిరంతరాయంగా సాగుతుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గూండాలకు, సిండికేట్ నాయకులకు మోడీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. "ఏప్రిల్ 23, 29 తేదీల లోపు సమీప పోలీస్ స్టేషన్లలో లొంగిపోండి. ఇదే మీకు చివరి అవకాశం. మే 4న ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. బెంగాల్ పులి అంటే ఇక్కడి ప్రజలేనని, వారి గర్జనకు అరాచక శక్తులు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
పోలింగ్ షెడ్యూల్
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలను టీఎంసీ అరాచకత్వానికి, ప్రజల విశ్వాసానికి మధ్య జరుగుతున్న పోరాటంగా బీజేపీ అభివర్ణిస్తోంది.
