Let's talk: editor@tmv.in
తిరుమల నెయ్యి కల్తీ కేసు: దేశవ్యాప్తంగా ఈడీ దాడులు, రూ.60 లక్షల నగదు స్వాధీనం

తిరుమల నెయ్యి కల్తీ కేసు: దేశవ్యాప్తంగా ఈడీ దాడులు, రూ.60 లక్షల నగదు స్వాధీనం

Gaddamidi Naveen
4 జూన్, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీకి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దేశవ్యాప్తంగా సంచలన దాడులు నిర్వహించింది. డెహ్రాడూన్, ఢిల్లీ, తమిళనాడులోని దిండిగల్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ముంబైతో సహా మొత్తం 15 ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి.

తమిళనాడు దిండిగల్‌కు చెందిన ‘ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్’, అహల్యానగర్‌కు చెందిన ‘మలగంగా మిల్క్ & ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రూర్కీకి చెందిన ‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థల కార్యాలయాలతో పాటు, వాటి డైరెక్టర్ల నివాసాలలో ఈ సోదాలు నిర్వహించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

నగదు స్వాధీనం – రూ.45 కోట్ల ఆస్తుల గుర్తింపు

ఈ సోదాల సమయంలో ఈడీ అధికారులు రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెయ్యి కల్తీ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మును వివిధ ఆస్తులలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈ దాడుల్లో నిరూపితమైంది. నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ. 45 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తుల వివరాలను, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు లభించినట్లు వెల్లడించారు.

ఏఆర్ డెయిరీ ఫుడ్‌తో పాటు మరికొందరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ, 2002 చట్టం కింద దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు కొందరు టీటీడీ అధికారులతో కుమ్మక్కై, నేరపూరిత నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడ్డారని, కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా ఆలయ సంస్థకు భారీ నష్టాన్ని చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా ఆర్జించిన నల్లధనాన్ని, నిధుల మూలాలను దాచేందుకు వివిధ వ్యాపార సంస్థలు, లీగల్ ఎంటిటీల ద్వారా స్థిరాస్తులలో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది.

సిట్ ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

ఈ ఏడాది ప్రారంభంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో తొమ్మిది మంది టీటీడీ అధికారులు, ఐదుగురు డెయిరీ నిపుణులతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది.

సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2019లో అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) ఆమోదంతో అధికారులు, బయటి డెయిరీ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నెయ్యి టెండర్ల నిబంధనలను సవరించడం, కొన్ని కొత్త షరతులను జోడించడం ఈ కమిటీ ఉద్దేశం. అయితే, నెయ్యి సేకరణ టెండర్ల ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన నిబంధనలను సడలించడం వల్ల.. కనీసం సొంతంగా పాలు సేకరించని డెయిరీలు, తగిన అనుభవం, నమ్మకశక్యత లేని కొత్త డెయిరీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని సిట్ ఆరోపించింది. ఈ నిబంధనల ఉల్లంఘనల కారణంగానే చివరకు టీటీడీ సేకరించిన నెయ్యి నాణ్యత దెబ్బతిని, లడ్డూ ప్రసాదాల పవిత్రత దెబ్బతినే పరిస్థితి వచ్చిందని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది.