
పశ్చిమాసియా శాంతిలో భారత్ కీలక పాత్ర పోషించే సమయం రావచ్చు: రాజ్‌నాథ్ సింగ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడంలో భారత్ మున్ముందు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న సమతుల్య విదేశాంగ విధానం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని ఆయన కొనియాడారు. జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
‘శాంతి స్థాపన కోసం భారత్ నిరంతరం కృషి’
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న యుద్ధ వాతావరణంపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. శాంతి స్థాపన కోసం భారత్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఏ పనికైనా సమయం రావాలని, భవిష్యత్తులో పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారంలో భారత్ విజయం సాధించే రోజు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ప్రధాని మోడీ ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయినప్పుడు కూడా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దౌత్య నీతితో నౌకలకు రక్షణ
భారత విదేశాంగ నీతి ఎంత బలంగా ఉందో చెప్పడానికి రాజ్‌నాథ్ సింగ్ ఒక ఉదాహరణ ఇచ్చారు. గతంలో హర్ముజ్ సముద్ర మార్గంలో ఉద్రిక్తతల వల్ల ఏ దేశ నౌకలు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు, భారతదేశం ఇటు అమెరికా, అటు ఇరాన్ దేశాలతో ఉన్న మంచి సంబంధాల వల్ల దేశానికి చెందిన ఏడెనిమిది నౌకలు క్షేమంగా ప్రయాణించగలిగాయని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాల గొడవల్లో పడకుండా అందరితోనూ స్నేహంగా ఉంటూ, సమతుల్యంగా వ్యవహరించడం వల్లే భారత్‌ను ఎవరూ శత్రువుగా చూడటం లేదని, ఇదే భారత విదేశాంగ నీతి గొప్పతనమని ఆయన స్పష్టం చేశారు.
భారత్ - జర్మనీ మధ్య 75 ఏళ్ల బంధం
భారత్, జర్మనీల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలే పునాదిగా ఇరు దేశాల మధ్య బంధం రోజురోజుకూ బలపడుతోందని అన్నారు. యూరోప్‌లో భారత్‌కు జర్మనీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారిందని, సుమారు 2,000కు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి 'మేక్ ఇన్ ఇండియా'కు ఊతమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా భారతీయ కంపెనీలు కూడా జర్మనీలో తమ ఉనికిని చాటుకుంటున్నాయని, ఇరు దేశాల ఆర్థిక ప్రగతిలో ఈ సహకారం ఎంతో కీలకమని ఆయన వివరించారు.
