Let's talk: editor@tmv.in
యాపిల్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న టిమ్ కుక్
యాపిల్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న టిమ్ కుక్

యాపిల్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న టిమ్ కుక్

Shaik Mohammad Shaffee
22 ఏప్రిల్, 2026

టెక్ ప్రపంచంలో ఒక సుదీర్ఘ శకం ముగియబోతోంది. ప్రపంచ అగ్రగామి టెక్ సంస్థ యాపిల్ సారథిగా గత 15 ఏళ్లుగా కంపెనీని విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ (65), తన సీఈఓ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వారసుడిగా (తదుపరి సీఈఓ) యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ (50) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా టిమ్ కుక్

సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, టిమ్ కుక్ యాపిల్‌ను పూర్తిగా వీడటం లేదు. ఆయన బోర్డుకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గతంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, నెట్‌ఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్ అనుసరించిన మాదిరిగానే, కుక్ కూడా తన అనుభవంతో కంపెనీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విధాన నిర్ణేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను ఆయన నిర్వహించనున్నారు.

4 ట్రిలియన్ డాలర్లకు యాపిల్ మార్కెట్ విలువ

2011లో వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణానంతరం యాపిల్ పగ్గాలను కుక్ చేపట్టారు. అప్పట్లో ఆయనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. స్టీవ్ జాబ్స్ అంతటి దార్శనిక' కుక్ దగ్గర ఉందా అని విమర్శకులు ప్రశ్నించారు. కానీ గడిచిన 15 ఏళ్లలో వాటన్నింటికీ ఆయన తన పనితీరుతో సమాధానమిచ్చారు.

కుక్ బాధ్యతలు చేపట్టినప్పుడు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ, నేడు 4 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.370 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. కంపెనీ వార్షిక ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 416 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఐఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ విజన్ ప్రో వంటి విప్లవాత్మక ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చారు. ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్ వంటి సర్వీసుల ద్వారా కంపెనీకి స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించారు.

ఎవరీ జాన్ టెర్నస్?

యాపిల్ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్, కంపెనీలో పాతికేళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన ఆయన, ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ వంటి కీలక ఉత్పత్తుల హార్డ్‌వేర్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. "జాన్ టెర్నస్‌ది ఇంజనీర్ మెదడు, ఆవిష్కర్త ఆత్మ. యాపిల్‌ను భవిష్యత్తులోకి నడిపించేందుకు ఆయనే సరైన వ్యక్తి" అని టిమ్ కుక్ తన వీడ్కోలు లేఖలో ప్రశంసించారు.

టిమ్ కుక్ భావోద్వేగ లేఖ

తన రాజీనామా సందర్భంగా ఉద్యోగులకు, వినియోగదారులకు కుక్ ఒక భావోద్వేగ లేఖ రాశారు. "గత 15 ఏళ్లుగా ప్రతిరోజూ ఉదయం యాపిల్ యూజర్లు పంపే ఈమెయిల్స్ చదవడంతోనే నా రోజు మొదలవుతుంది. యాపిల్ వాచ్ వల్ల ప్రాణాలు నిలిచాయని కొందరు, మ్యాక్ వల్ల తమ పని సులువైందని మరికొందరు చెప్పే మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ గొప్ప బాధ్యతను సమర్థుడైన జాన్ టెర్నస్ చేతుల్లో పెడుతున్నందుకు సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో యాపిల్ కంపెనీ బాధ్యతలను కొత్త నాయకుడికి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ కొత్త ప్రయాణంలో, జాన్ టెర్నస్ సారథ్యంలో యాపిల్ ఎలాంటి సరికొత్త వింతలు, విశేషాలను మన ముందుకు తీసుకువస్తుందో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.