Let's talk: editor@tmv.in
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై ముంబై ఘన విజయం
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై ముంబై ఘన విజయం

తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై ముంబై ఘన విజయం

Shaik Mohammad Shaffee
21 ఏప్రిల్, 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో కుంగిపోయిన ముంబై ఇండియన్స్‌ను తెలుగు తేజం తిలక్ వర్మ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. సోమవారం మొతేరా స్టేడియం వేదికగా జరిగిన పోరులో తిలక్ వర్మ (101 నాటౌట్; 45 బంతుల్లో) మెరుపు సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. తిలక్ విధ్వంసానికి బౌలర్లు కూడా తోడవడంతో ముంబై మళ్ళీ విజయాల బాట పట్టింది.

ఆరంభంలో తడబాటు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలో కగిసో రబడా (3/33) చుక్కలు చూపించాడు. క్వాంటన్ డికాక్ (13), సూర్యకుమార్ యాదవ్ (15)లను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ పంపాడు. ఒక దశలో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనిపించింది. తిలక్ వర్మ కూడా మొదట్లో 22 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి తడబడ్డాడు. అయితే 14వ ఓవర్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిలక్‌కు క్లాస్ పీకడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ చర్చ తిలక్‌లో కసిని పెంచింది.

గేర్ మార్చిన తిలక్

ఆ తర్వాత తిలక్ ఆడిన ఆట అద్భుతం. తర్వాతి కేవలం 23 బంతుల్లోనే 82 పరుగులు రాబట్టి ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లో 19 పరుగులు, యువ బౌలర్ అశోక్ శర్మ ఓవర్లో 26 పరుగులు రాబట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తం 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ముంబై స్కోరును 199/5 కి చేర్చాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.

బుమ్రా మేజిక్.. కుప్పకూలిన టైటాన్స్

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు జస్ప్రీత్ బుమ్రా మొదటి బంతికే షాకిచ్చాడు. గత ఐదు మ్యాచ్‌లుగా వికెట్ తీయలేక ఇబ్బంది పడుతున్న బుమ్రా.. సాయి సుదర్శన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. ఆ తర్వాత ఎడమచేతి వాటం పేసర్ అశ్విని కుమార్ (4/24) మధ్య వరుసను దెబ్బతీయగా, మిచెల్ సాంట్నర్ (2/16) తన స్పిన్‌తో కట్టడి చేశాడు.

గుజరాత్ జట్టులో రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ వంటి ఫినిషర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరూ కలిసి 24 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగారు. కోచ్ ఆశిష్ నెహ్రా వీరిపై పెట్టిన నమ్మకం వమ్ము కావడంతో గుజరాత్ 15.5 ఓవర్లలోనే 100 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకోవడమే కాకుండా, తమ నెట్ రన్ రేట్‌ను (+0.067) గణనీయంగా మెరుగుపరుచుకుంది.

తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై ముంబై ఘన విజయం - Tholi Paluku