
చేప ప్రసాదం పంపిణీకి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్న వార్షిక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు.
గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ, జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్, సోమవారం రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుందని తెలిపారు. బత్తిన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మందికి పైగా భక్తులు కార్యక్రమానికి చేరుకున్నారని వెల్లడించారు.
భద్రతా దృష్ట్యా దాదాపు 1000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని విధుల్లో నియమించినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ప్రత్యేక ప్రకటనలు చేయనున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య బృందాలు, ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానికులు నేడు రావాలని సూచించిన సీపీ, తగినంత ప్రసాదం అందుబాటులో ఉందని, అపోహలు, పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
