
ఏపీలో మరో రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో పలు మండలాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) సోమవారం తెలిపింది.
కర్ణాటక ప్రాంతం నుంచి తీరప్రాంత ఆంధ్ర తీరం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమవారం నుంచి రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ఒకవైపు ఉరుములు, మెరుపుల ప్రభావం, మరోవైపు తీవ్రమైన ఎండలు ఇలాంటి మిశ్రమ వాతావరణం కొనసాగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
మండలాల్లో వడగాల్పుల తీవ్రత
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 67 మండలాల్లో సాధారణ వడగాల్పుల తీవ్రతగానే ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీయవచ్చు.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C నుంచి 44°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40°C నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5°C ఉష్ణోగ్రత నమోదు కాగా, మార్కాపురం మండలం నందనమరెల్లలో 43.4°C, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, కృష్ణా జిల్లా పెదపారుపూడిలలో 43.2°C చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అధికారుల జాగ్రత్తలు – సూచనలు
తీవ్రమైన ఎండల దృష్ట్యా వృద్ధులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. గుండె జబ్బులు, షుగర్, రక్తపోటు (బీపీ) సమస్యలతో బాధపడేవారు ఎక్కువసేపు ఎండలో తిరగవద్దని, శరీరంలో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలని కోరారు. మరోవైపు, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, పెద్ద హోర్డింగుల కింద నిలబడకూడదని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
