
బీహార్ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా జాతీయ రహదారి-19 పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పర్యాటక బస్సు, ముందు వెళ్తున్న ట్రక్-ట్రైలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సంగం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిలో 7 నుంచి 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం, ఈ బస్సు బోధ్‌గయ నుంచి కాశీ (వారణాసి) కి సుమారు 40 మంది యాత్రికులతో ప్రయాణిస్తుండగా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ మరొక వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
బీహార్‌లో నెల్లూరు జిల్లా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సీఎం చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముగ్గురు యాత్రికుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ యాత్రికుల బస్సు జూన్ 1న నెల్లూరు జిల్లా నుంచి కాశీ యాత్ర కోసం బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన యాత్రికులను తిరిగి వారి సొంత ఊర్లకు చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాత్రికులందరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.
బీహార్ బస్సు ప్రమాదం అత్యంత విషాదకరం: వైయస్ జగన్
బీహార్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు బయల్దేరిన ప్రైవేట్ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైయస్ జగన్, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బాధిత కుటుంబాలకు మంత్రి అనిత భరోసా
ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మంత్రి వెంటనే బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బీహార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఏపీ యాత్రికులకు అత్యుత్తమ వైద్యం అందేలా స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నామని, ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
