
ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు కొత్త అదనపు న్యాయమూర్తులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ వారికి ప్రమాణ స్వీకారం చేయించారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి నియామకాలకు ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
అనంతరం హైకోర్టులో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. ఈ నియామకాలతో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం కావడానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొని నూతన అదనపు న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
