Let's talk: editor@tmv.in
హైటెక్స్‌లో జూన్ 5 నుంచి 7 వరకు ‘త్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్

హైటెక్స్‌లో జూన్ 5 నుంచి 7 వరకు ‘త్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్

Gaddamidi Naveen
30 మే, 2026

చేనేత మగ్గాలపై నేసిన సాంప్రదాయ కళాఖండాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత వస్త్రాలు ఇప్పుడు నగర ప్రజలకు మరింత చేరువ చేసే ప్రత్యేక ప్రదర్శన ‘త్రెడ్​ పోచంపల్లి’ పేరుతో జూన్ 5 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. చేతివృత్తుల గొప్పతనాన్ని పరిచయం చేయడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం. గ్రామీణ కళాకారులు, పట్టణ వినియోగదారుల మధ్య వారధిగా ఈ మూడు రోజుల వేడుక నిలవనుంది.

100కు పైగా స్టాళ్లతో చేనేత జాతర

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చేనేత కార్మికులు, తయారీదారుల నుంచి నేరుగా సేకరించిన ప్రామాణికమైన చేనేత వస్త్రాలు, లగ్జరీ చీరలు, ఆధునిక దుస్తులతో కూడిన 100కు పైగా ప్రత్యేక స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యాపార ప్రదర్శన మాత్రమే కాదు, ఒక సజీవ సాంస్కృతిక పర్యావరణ వ్యవస్థగా నిలవబోతోంది.

అంతేకాకుండా, సంప్రదాయ మగ్గాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు, పోచంపల్లి శైలికి గుర్తింపు తెచ్చిన క్లిష్టమైన టై అండ్ డై పద్ధతిలో నూలు రంగుల అల్లిక ప్రక్రియ, చేతి వృత్తుల వెనుక ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి ప్రాంతానికి చెందిన స్థానిక వంటకాలను కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు.

ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే కాకుండా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించే తొలి అడుగుగా భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కేవలం రెండు గంటల దూరంలో ఉన్న పోచంపల్లిని వీకెండ్ పర్యటనల గమ్యస్థానంగా పరిచయం చేయడమే లక్ష్యంగా పర్యాటక మార్గాలను కూడా సందర్శకులకు తెలియజేయనున్నారు. సంప్రదాయం, కళ, సంస్కృతి, గ్రామీణ జీవన శైలిని ఒకే వేదికపై ఆవిష్కరించే ఈ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.