
పనయూర్‌లో వెలుగులోకి వేల ఏళ్ల నాటి సముద్ర శిలాజాలు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పరిధిలో ఉన్న పనయూర్ గ్రామంలో వేల ఏళ్ల నాటి సముద్ర శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతం తూత్తుకుడి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శిలాజ స్థలాన్ని తొలిసారిగా 2025 డిసెంబరులో ఒక చారిత్రక ఆసక్తి గల వ్యక్తి గుర్తించారు. అనంతరం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల బృందం జనవరి 5 నుంచి 10 వరకు భౌగోళిక, పురావస్తు అధ్యయనాలు నిర్వహించింది. ఈ పరిశోధనలో మొత్తం 104 శిలాజ నమూనాలను సేకరించారు. వీటిలో ప్రధానంగా బైవాల్వ్స్, గాస్ట్రోపోడ్స్ వంటి సముద్ర జీవుల అవశేషాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ శిలాజాలు హోలోసీన్ యుగానికి చెందినవిగా గుర్తించారు. అంటే ఇవి సుమారు 8,000 నుంచి 12,000 సంవత్సరాల నాటివి. సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ ప్రాంతం ఒకప్పుడు నీటిలో మునిగిపోయి ఉండేదని, దాంతో ఈ శిలాజాలు ఏర్పడ్డాయని వారు తెలిపారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ శిలాజ స్థలం ప్రస్తుత తీరరేఖ నుంచి 5–7 కిలోమీటర్ల లోపల ఉంది. ఇది కాలక్రమేణా తీర ప్రాంత భౌగోళిక మార్పులను సూచిస్తోంది. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు, ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు రేడియో కార్బన్ డేటింగ్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన కేంద్రమంత్రి
ఈ విషయంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ, 2023లో భారీ వర్షాల వల్ల బయటపడిన శిలాజ స్థలాలపై జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన పరిశోధనలో హోలోసీన్ యుగానికి చెందిన కొత్త ఫాసిల్ బెడ్ గుర్తించిందని తెలిపారు. ఇది భారతదేశ ప్రాచీన జీవజాలం, పర్యావరణం, వాతావరణంపై అవగాహన పెంచేందుకు కీలకమని పేర్కొన్నారు. అలాగే తూత్తుకుడిలోని వి.ఓ. చిదంబరం కాలేజీ భూగర్భ శాస్త్ర విభాగానికి చెందిన ఆచార్యులు ఆంటోనీ రవీంద్రన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో వేర్వేరు ఆకారాల శిలాజాలు, భూగర్భ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఇసుకరాతి పొరలు, లేటరైట్ ఎర్ర మట్టి ఎక్కువగా కనిపిస్తున్నాయని, 2023లో భారీ వర్షాల కారణంగా ఇంతకాలం ఇసుక కింద దాగి ఉన్న ఈ శిలాజాలు బయటపడ్డాయని వివరించారు.
