Let's talk: editor@tmv.in
ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది: కవిత

ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది: కవిత

Gaddamidi Naveen
25 జూన్, 2026

జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ‘వెటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్’ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధికారత ఆవశ్యకతపై ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా, ఒక రకమైన పక్షపాతంతో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎంత కష్టపడినా, ప్రతిభ చూపినా ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట పడుతోంది. సమాజంలో కేవలం రెండే కులాలు ఉన్నాయి.. ఒకటి మహిళల కులం, రెండోది మగవాళ్ల కులం. మహిళలంతా ఒక్కటే అని ఆమె పేర్కొన్నారు. ఒక మహిళా జడ్జితో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తూ, పరీక్షలు రాసి వచ్చే మహిళా జడ్జిల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పైస్థాయికి వెళ్లేందుకు మాత్రం అవకాశాలు రావడం లేదని తెలిపారు.

మహిళలు ఒకసారి లక్ష్యంపై నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత మీ మాట మీరే వినవద్దు. కష్టపడి ముందుకు సాగాల్సిందే అని క‌విత సూచించారు. మహిళా సాధికారత కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే సాధ్యం కాదని, కుటుంబం, సమాజం కూడా సహకరించాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నప్పటికీ, ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్లే ఆ పోస్టులు భర్తీ కావడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆమె కొన్ని కీలక గణాంకాలను వివ‌రించారు. ఇప్పటికీ 2026 లో కూడా మన రాష్ట్రంలో 15-19 ఏళ్ల వయసులోనే పెళ్లై తల్లులైన వారు 7.2 శాతం ఉన్నారు. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ లోనూ టీనేజ్ మదర్స్ 2.7 శాతం ఉన్నారు. ఆడపిల్లకు పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించే ఆలోచనా విధానం ఇంకా మారాల్సి ఉందన్నారు.

రాజకీయాల్లో ఒక మహిళగా తానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఏదైనా మాట్లాడితే లక్ష మంది వరకు జెండర్ బేస్డ్ (లింగ వివక్ష) గా ట్రోల్ చేస్తారని ఆమె మండిపడ్డారు. చివరికి ఇంటర్నెట్, ప్రస్తుతం వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా పాత సమాచారం ఆధారంగా పనిచేస్తూ మహిళల పట్ల పక్షపాతంగానే ఉంటోందని విశ్లేషించారు. యువత సోషల్ మీడియా లైక్స్, అల్గరిథమ్‌ల కోసం కాకుండా ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాల కోసం కష్టపడాలని కవిత హితవు పలికారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న వెటా ఇండియా సంస్థను, అధినేత ఝాన్సీని ఆమె అభినందించారు.

ట్యాగ్‌లు
KalvakuntlaKavithaKavithaWomenEmpowermentWomenLeadershipWomenInPoliticsGenderEqualityWomenRightsTelanganaHyderabadVETAIndia
ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది: కవిత - Tholi Paluku