
ఇది నా వ్యక్తిగత ఓటమి కాదు.. ప్రజాస్వామ్యానికే ఎదురుదెబ్బ: మీనాక్షి నటరాజన్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. దీనిని తాను వ్యక్తిగత ఓటమిగా భావించడం లేదని, ఇది దేశ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకే తగిలిన పెద్ద ఎదురుదెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి, తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆమె శుక్రవారం పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తనపై ఉన్న ఒక కేసును దాచారనే నెపంతో నామినేషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌ను విచారించడానికి తాము సిద్ధంగా లేమంటూ కోర్టు దానిని తిరస్కరించింది. అయితే హైకోర్టు పరిధిలో దాఖలు చేసే ఎలాంటి ఎలక్షన్ పిటిషన్‌పైనైనా ఈ వ్యాఖ్యల ప్రభావం ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మీనాక్షిపై ఇంకా ఎలాంటి చార్జీలు ఫ్రేమ్ కాలేదని, కాబట్టి నామినేషన్ తిరస్కరించడం చెల్లదని కోర్టుకు విన్నవించారు.
ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని మీనాక్షి నటరాజన్ తీవ్రంగా ఆరోపించారు. తమ పార్టీ నాయకులు ఈ విషయమై ఈసీని సంప్రదిస్తే 48 గంటల పాటు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, కనీసం సుప్రీంకోర్టు తమ పిటిషన్‌ను ఆలకించి తీర్పునైనా ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రానిది కాదని, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం తీరుతో ముడిపడి ఉన్నదని విమర్శించారు. కాగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు న్యూఢిల్లీలో భారీ ‘సత్యాగ్రహం’ నిరసనను చేపట్టాయి.
ఫామ్-26 వివాదం.. దాచిపెట్టింది ఏమీ లేదు
సుప్రీంకోర్టు విచారణకు ముందు.. తన నామినేషన్ తిరస్కరణకు దారితీసిన ఫామ్-26 వివాదంపై రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న మీనాక్షి నటరాజన్ శుక్రవారం స్పందించారు. తాను ఎలాంటి వాస్తవాలను దాచిపెట్టలేదని, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అన్ని పత్రాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో కేసుకు సంబంధించిన అన్ని న్యాయపరమైన అంశాలపై విస్తృతంగా మాట్లాడలేనని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రజా డొమైన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ వివాదానికి కేంద్రబిందువైన ఫామ్-26 అనేది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, అలాగే క్రిమినల్ కేసులు లేదా శిక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించే అఫిడవిట్ అని ఆమె వివరించారు. ఈ ఫామ్‌లో కొన్ని వివరాలను నమోదు చేయకుండా తాను వాస్తవాలను దాచిపెట్టాననే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.
అయితే తనపై ఎటువంటి పెండింగ్ క్రిమినల్ కేసు లేదని, కేవలం ఒక లీగల్ నోటీసు మాత్రమే అందిందని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఫామ్-26లో పెండింగ్ కేసులు లేదా శిక్షలకు సంబంధించిన కాలమ్‌లలో అది వర్తించదని నమోదు చేసినట్లు వివరించారు. నాకు అందింది కేవలం న్యాయ నోటీసు మాత్రమే. ఈ వ్యవహారంలో కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ కూడా తీసుకోలేదని ఆమె అన్నారు.
అదేవిధంగా ఆ నోటీసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన మెమొరాండంలో వెల్లడించినట్లు తెలిపారు. అదే విషయాలను సుప్రీంకోర్టు ఎదుట కూడా ఉంచనున్నట్లు చెప్పారు. ఫామ్-26లో ప్రైవేట్ ఫిర్యాదులు లేదా యాదృచ్ఛిక న్యాయ ఫిర్యాదుల వివరాలను నమోదు చేయాల్సిన ప్రత్యేక కాలమ్ లేదని ఆమె స్పష్టం చేశారు. అలాంటి కాలమ్ ఉంటే తాను తప్పకుండా ఆ సమాచారాన్ని వెల్లడించేదాన్నని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశంపై స్పష్టమైన అవగాహన అవసరమని అన్నారు. మీనాక్షి నటరాజన్‌తో కలిసి కాంగ్రెస్ నేతలు హరీష్ చౌదరి, జీతూ పట్వారి, ఉమంగ్ సింఘార్, దేవేంద్ర యాదవ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
