Let's talk: editor@tmv.in
మమతా బెనర్జీ ఓటమికి ఇది స్పష్టమైన సంకేతం: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

మమతా బెనర్జీ ఓటమికి ఇది స్పష్టమైన సంకేతం: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

Gaddamidi Naveen
27 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటమిని ముందే అంగీకరించారని, అందుకే తీవ్ర అసహనంతో ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆదివారం వ్యాఖ్యానించారు. భవానీపూర్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు.

భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సభలు సమీపంలోనే జరిగాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగా లౌడ్ స్పీకర్లతో అంతరాయం కలిగిస్తోందని ఆరోపిస్తూ మమత తన ప్రసంగాన్ని ఆపివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీనిపై బూర నర్సయ్య గౌడ్ స్పందిస్తూ.. మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న ఫ్రస్ట్రేషన్ ఆమె ఓటమికి నిదర్శనం. మమతా గత 15 ఏళ్లుగా మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు, గూండాగిరిపై ఆధారపడుతున్నారని ఆయ‌న‌ ఆరోపించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అది ఒక సునామీలా రాబోతోందని అన్నారు. టీఎంసీ గూండాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హెచ్చరికను ఆయన సమర్థించారు.

మమతా బెనర్జీ వేదిక వీడిన తర్వాత ఆగ్రహించిన టీఎంసీ కార్యకర్తలు బీజేపీ సభ వైపు దూసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య "జై బంగ్లా", "జై శ్రీరామ్" నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ , పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సువేందు అధికారి ఈ ఘటనను టీఎంసీ గూండా రాజ్ కు నిదర్శనంగా అభివర్ణించారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం అత్యంత ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 92.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ మార్పుకు సంకేతమని బీజేపీ భావిస్తోంది. భవానీపూర్ సహా ఇతర స్థానాలకు ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.