
మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు: వైఎస్ జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఈ వ్యవస్థలో దాదాపు 20 ఏళ్లకు పైబడి నమ్మకంగా పనిచేస్తున్న వారు ఎందరో ఉన్నారని వైఎస్ జగన్ గుర్తుచేశారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో సరికొత్త విధానాన్ని తెచ్చి, తన సొంత పార్టీ వారి పొట్టలు నింపుకోవడానికి, ఇన్నాళ్లుగా పనిచేస్తున్న పేద అక్కచెల్లెమ్మలను రోడ్డున పడేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన గత రెండు నెలల జీతాలను ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బకాయి పెట్టిందని విమర్శించారు.
గతంలో కేవలం రూ. 1,000 ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3,000 లకు పెంచామని గుర్తు చేశారు. కానీ, ఈ ఎన్నికలకు ముందు వీరికి ఇంకా మేలు చేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని తొలగించి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యాహ్న భోజన కార్మికుల హక్కుల తరఫున వైయస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా నిలిచి పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే బకాయి పెట్టిన రెండు నెలల జీతాలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల నాటి ఇచ్చిన మాట ప్రకారం వారి వేతనాలను మరింత పెంచాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
