Let's talk: editor@tmv.in
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండదు:కేంద్రం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండదు:కేంద్రం

Pinjari Chand
24 ఏప్రిల్, 2026

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియాలో వస్తోన్న వదంతులను కొట్టిపారేసింది. ధరలు లీటరుకు రూ.25–28 వరకు పెంచే ప్రతిపాదన ఎలాంటి దశలో లేదని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికలో తెలిపింది.

భయాందోళన కలిగించే వార్తలు: కేంద్రం

పశ్చిమబెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ధరలు పెరుగుతాయని ఒక నివేదిక వెలువడిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరితే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.25–28 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ తరహా వార్తలు ప్రజల్లో భయం, ఆందోళన సృష్టించేందుకు ఉద్దేశించినవని, అవి తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

నాలుగేళ్లుగా స్థిరంగా ధరలు

భారతదేశంలో గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, ప్రజలపై భారం పడకుండా కేంద్రం, ఆయిల్ పీఎస్యూలు చర్యలు తీసుకున్నాయని పేర్కొంది.

అంతర్జాతీయ ప్రభావం

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు చేయడం, అనంతరం ప్రతీకార చర్యలతో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద సరఫరా ప్రభావితం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 119 డాలర్ల వరకు పెరిగి, ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 103–106 డాలర్ల మధ్య ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 కాగా, డీజిల్ ధర రూ.87.67గా కొనసాగుతోంది.