
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: గొట్టిపాటి రవికుమార్
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూపాయి చొప్పున తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు ప్రజలపై భారం తగ్గించే విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ట్రూ అప్ పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేస్తూ వినియోగదారులకు ఊరటనిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని సౌర, వాయు విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వినియోగ భారం ఆధారంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న సుదీర్ఘ అనుభవం వల్లే విద్యుత్ రంగంలో సంస్కరణలు సాధ్యమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోళ్లు నిర్వహించి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “సూర్యఘర్” పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి కనెక్షన్ల లక్ష్యాన్ని పెట్టుకోగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు 20 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు
