
మా హక్కులు దెబ్బతింటే భారీ ఉద్యమం: సీఎం స్టాలిన్
ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తమిళనాడు వ్యాప్తంగా భారీ ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. మంగళవారం ప్రత్యేక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగ సవరణను కేంద్రం బలవంతంగా ఆమోదింపజేయాలని చూస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరగనుండగా, అందులో ‘నారీశక్తి వందన్ అధినియమ్’ సవరణలు, డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సహా దక్షిణ రాష్ట్రాలు గతంలో కేంద్రం సూచనల మేరకు కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ విధానాలను కచ్చితంగా అమలు చేశాయని స్టాలిన్ తెలిపారు. ఇప్పుడు అదే కారణంగా పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం తగ్గేలా చేసే డీలిమిటేషన్ చేయడం అది అన్యాయమని అన్నారు.
ప్రధానిని కలిసేందుకు అనుమతి కోరినా ఇవ్వలేదు
డీలిమిటేషన్ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలను కలుపుకుని చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్రానికి తమ అభిప్రాయాలు తెలియజేయడానికి వివిధ పార్టీల ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకునేందుకు సమయం కోరినా అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో త్వరితగతిన డీలిమిటేషన్‌ను అమలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా మారుతుందని, రాష్ట్రాల హక్కులను హరించే చర్యగా నిలుస్తుందని ఆయన విమర్శించారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే దేశమంతా గమనించేలా పోరాటం చేస్తాం. తమిళనాడు పోరాడుతుంది, గెలుస్తుందని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదన ప్రకారం మహిళల రిజర్వేషన్ అమలు కోసం కొత్త జనగణన, డీలిమిటేషన్ ఆధారంగా సీట్ల పునర్విభజన చేయాలని మొదట భావించినప్పటికీ, జనగణన ఆలస్యం కావడంతో 2011 జనగణన ఆధారంగా అమలు చేయాలని యోచిస్తోంది. సవరణల తర్వాత లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి 816కి పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రత్యేక డీలిమిటేషన్ బిల్లు కూడా తీసుకురానున్నారు. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ సవరణల రూపంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) రిజర్వేషన్‌పై ప్రత్యేక నిబంధన లేదని తెలుస్తోంది.
