Let's talk: editor@tmv.in
ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: ఎన్నికల కమిషన్‌కి వైసీపీ లేఖ

ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: ఎన్నికల కమిషన్‌కి వైసీపీ లేఖ

Panthagani Anusha
9 మే, 2026

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి లేఖ రాశారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డిజిటల్ జాబితా అందించాలి

ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితాయే ప్రాథమిక పునాది అని ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం వినియోగించే జాబితాలను నియోజకవర్గం, బూత్ వారీగా డిజిటల్ ఫార్మాట్‌లో రాజకీయ పార్టీలకు అందజేయాలని కోరారు. తద్వారా ఓటర్ల తొలగింపు, డూప్లికేట్ ఎంట్రీలు, ఓటర్ల మార్పిడి వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. నిజమైన ఓటరు తన హక్కును కోల్పోకుండా ఉండటమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగాలని స్పష్టం చేశారు.

బీఎల్‌వో* *ల వివరాలు బహిర్గతం చేయాలి

బూత్ లెవల్ అధికారుల ( బీఎల్‌వో ) వివరాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని వైఎస్సార్‌సీపీ లేఖలో డిమాండ్ చేసింది. ప్రతి నియోజకవర్గంలో పనిచేసే బీఎల్‌వో ల పేర్లు, వారి బాధ్యతలు సంప్రదింపు వివరాలను వెల్లడించాలని కోరింది. మరోవైపు బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకానికి సంబంధించిన బీఎల్ఏ-2 దరఖాస్తులను స్వీకరించడంలో కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల నమోదు అధికారులు జాప్యం చేస్తున్నారని అప్పిరెడ్డి ఆరోపించారు. దీనిపై తక్షణమే స్పందించి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగేలా చూడాలని కోరారు.

అవగాహన సదస్సులు నిర్వహించాలి

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల చేర్పులు, మార్పులు మరియు బీఎల్‌వో యాప్ ద్వారా జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్‌ పై అనేక సందేహాలు ఉన్నాయని వీటిని నివృత్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

కాగా ఇప్పటికే ఈ సవరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నేతృత్వంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులకు క్షేత్రస్థాయిలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. అధికారులు ఎంత సన్నద్ధంగా ఉన్నారో రాజకీయ పార్టీలకు కూడా అంతే స్థాయిలో సమాచారం, సమయం కేటాయించాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది.