Let's talk: editor@tmv.in
పోక్సో కేసులో పక్షపాతం లేని విచారణ జరగాలి: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌‌రెడ్డి

పోక్సో కేసులో పక్షపాతం లేని విచారణ జరగాలి: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌‌రెడ్డి

Gaddamidi Naveen
19 మే, 2026

పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు కోర్టు మే 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు.

మీడియాతో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు బండి భగీరథ్ అయినా లేదా మరెవరైనా సరే.. వారి హోదా, పదవులతో సంబంధం లేకుండా చట్టప్రకారం వ్యవహరించాలి. నిందితుడికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు, రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకూడదు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్ లో ఉన్నందున, పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు జరిపి బాధితులకు నిష్పక్షపాతంగా న్యాయం అందించాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, భగీరథ్ తరఫు న్యాయవాది కరుణాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో తాము సీనియర్ అడ్వకేట్ ఆంటోనీ రెడ్డితో కలిసి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించామని, దర్యాప్తునకు భగీరథ్ పూర్తిగా సహకరించారని తెలిపారు. న్యాయ ప్రక్రియ ద్వారా తమ క్లయింట్ నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.