
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: ఓఎంసీలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రస్తుత అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ తెలిపిన వివరాల ప్రకారం, సరఫరా పరిస్థితిని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అవసరమైన చోట లాజిస్టిక్స్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, సరఫరాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మే నెల తొలి పక్షంలో పెట్రోల్ సరఫరాలు 14.2 శాతం, డీజిల్ సరఫరాలు 15.7 శాతం మేర పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు.
ఇక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు వేసవి తీవ్రత కారణంగా ప్రస్తుతం కొంత తగ్గినట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి ఎలాంటి భయాందోళనలతో కూడిన అధిక బుకింగ్‌లు నమోదవడం లేదని స్పష్టం చేశారు. మే 17 వరకు తెలంగాణలో మొత్తం 20.06 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఇది ఈ కాలానికి సాధారణ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు.
ఎల్పీజీ వినియోగదారులు సిలిండర్ బుకింగ్ కోసం ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఐవీఆర్‌ఎస్, ఆన్‌లైన్ వేదికలను వినియోగించాలని సూచించారు. అలాగే సిలిండర్ల అక్రమ మళ్లింపును అరికట్టేందుకు, సరైన లబ్ధిదారులకు సరఫరా జరిగేలా ‘డెలివరీ ఆథెంటికేషన్ కోడ్’ (డీఏసీ) విధానానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో డీఏసీ అమలు 95 శాతం దాటిందని, దాన్ని 100 శాతానికి తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఓఎంసీలు వెల్లడించాయి.
