Let's talk: editor@tmv.in
కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు తావు లేదు: బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్

కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు తావు లేదు: బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్

Gaddamidi Naveen
2 మే, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అక్రమాలకు అవకాశం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ శుక్రవారం పేర్కొన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

కోల్‌కతాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మనోజ్ అగర్వాల్, అక్రమాలు జరుగుతాయన్న వాదనల్లో వాస్తవం లేదు. స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల ఏర్పాటు చేసిన మానిటర్ల ద్వారా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు లోపల ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఏదైనా ఆరోపణలు చేసే ముందు సరైన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలో అదనపు బలగాలను మోహరించినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ రూపేష్ కుమార్ తెలిపారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు (సీఏపీఎఫ్), సాయుధ పోలీసు బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా ఉంచుతున్నారని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పోస్టల్ బ్యాలెట్లను తరలించే సమయంలో అనధికారిక కదలికలు జరిగే అవకాశం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకే తమ పోలింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మంత్రి శశి పంజా కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.