

డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి
మహిళలు, పిల్లల రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహిళా రక్షణ బృందాలు 'స్పందన' ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడం ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 'షీ టీమ్స్', 'స్టాండ్ విత్ హర్' వంటి కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని, తాజాగా ప్రారంభించిన 'స్పందన' 24/7 ప్రతిస్పందన బృందాలు ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ మానసిక, సంస్థాగత మద్దతును అందిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసాను మహిళల్లో కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
మహిళా సాధికారత రాష్ట్ర అభివృద్ధికి కీలకమని సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై కేటాయించడం, వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 67 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. అలాగే ఒక కోటి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయగా, గత 28 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు 1,000 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి లీజుకు ఇవ్వడం, 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను కేటాయించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించామని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం
మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు డ్రగ్స్ అలవాటు ప్రధాన కారణమని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిరోధానికి 'ఈగల్ ఫోర్స్' ను ఏర్పాటు చేశామని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి ప్రభావిత వ్యక్తులైనా, రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసులు తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని ఆదేశించారు. శాంతి కమిటీలు డ్రగ్స్ సమస్యలపై అవగాహన కల్పించాలని, విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వీయ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
మేము ఎవరినీ విడిచిపెట్టం. వారు ప్రజాప్రతినిధులైనా, సెలబ్రిటీలైనా మాకు అనవసరం. వారి హోదాను చూడము, కేవలం చేసిన నేరాన్ని మాత్రమే చూస్తాము అని ఆయన ఉద్ఘాటించారు. ఇటీవల మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేపై తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
పంజాబ్ పరిస్థితి తెలంగాణకు రాకూడదు
ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు, ధైర్యవంతులైన సైనికులకు పుట్టినిల్లుగా ఉన్న పంజాబ్ రాష్ట్రం, నేడు డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎంతగా చితికిపోయిందో సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సర్వే ప్రకారం పంజాబ్‌లో 70 శాతం జనాభా డ్రగ్స్ బారిన పడ్డారని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రానివ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు.
విద్యావంతులూ డ్రగ్స్ ఉచ్చులో..
తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని సీఎం అన్నారు. పాఠశాలల సమీపంలో గంజాయి కలిపిన చాక్లెట్లు అమ్ముతున్నారని, డాక్టర్లు, ఇంజినీర్లు వంటి ఉన్నత విద్యావంతులు కూడా డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొంటున్నారని తెలిపారు. కొందరు చైన్ స్నాచింగ్ వంటి నేరాల్లో కూడా పాల్గొంటున్నారని అన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు ప్రధాన కారణం మాదకద్రవ్యాల సేవనమేనని ఆయన విశ్లేషించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచన మేరకు, పాఠశాల ప్రవేశ పత్రాల్లో విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామనే స్వీయ ప్రతిజ్ఞ ను చేయాలని సీఎం ప్రతిపాదించారు. వెయ్యి మంది సామాన్యులపై కేసులు పెట్టడం కంటే, తప్పు చేసిన ఒక సెలబ్రిటీని అరెస్టు చేసి ఏడాది పాటు జైల్లో ఉంచితే సమాజంలో భయం, బాధ్యత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్తిగా మహిళలతో కూడిన 'స్పందన' బృందాలు అత్యవసర సమయాల్లో బాధితుల పిలుపునకు తక్షణమే స్పందిస్తాయని, నిందితులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటాయని సీఎం వివరించారు. రాజకీయ, వ్యాపార లేదా ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన వారైనా సరే, నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు.
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని, ఇది సాధ్యం కావాలంటే మహిళా భద్రత, సాధికారత తప్పనిసరి అని సీఎం ఉద్ఘాటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, తెలంగాణను మహిళా భద్రతలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా 'స్పందన' పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు.
