
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు..ఆందోళన వద్దు:హెచ్‌పీసీఎల్ జనరల్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ (ఎల్‌పీజీ), పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సరఫరా అత్యంత సాధారణంగా కొనసాగుతోందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ఎన్. భాస్కర రెడ్డి స్పష్టం చేశారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ హోదాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు 15 రోజులకు సరిపడా అందుబాటులో ఉన్నాయని అదేవిదంగా ఎల్‌పీజీ నిల్వలను నిరంతరం మూడు రోజుల ముందస్తు అవసరాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థలతో సమన్వయం చేసుకుంటూ గత నెల రోజులుగా నిరంతరాయంగా సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తగ్గుముఖం పట్టిన బుకింగ్‌లు.. వేగంగా డెలివరీ
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్తులో కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో గతంలో గ్యాస్ బుకింగ్‌లు ఒక్కసారిగా నాలుగు లక్షలకు చేరుకున్నాయని భాస్కర రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందని రోజువారీ బుకింగ్‌లు సగటున రెండు లక్షలకు తగ్గాయని వివరించారు. గతంలో పెరిగిన డిమాండ్ వల్ల సిలిండర్ డెలివరీలో 10 రోజుల వరకు ఆలస్యం జరిగిందని ప్రస్తుతం ఆ సమయం 5-6 రోజులకు తగ్గిందని పేర్కొన్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే దీనిని మళ్ళీ 2-3 రోజుల సాధారణ స్థితికి తీసుకువచ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
వాణిజ్య రంగానికి ప్రాధాన్యత.. టీటీడీకి పైప్డ్ గ్యాస్
రాష్ట్రంలోని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు రోజుకు 7,600 పైగా 19 కిలోల సిలిండర్లను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. హోటళ్ల అవసరాల్లో 70 శాతం వరకు తీరుస్తున్నామని అదే సమయంలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు మాత్రం 100 శాతం సరఫరా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పలు ప్రధాన ఆలయాలకు ఇండియన్ ఆయిల్ ద్వారా పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తున్నామని లడ్డూల తయారీ, అన్నప్రసాదం పంపిణీకి ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వంతో సమన్వయం.. పీఎన్‌జీపై దృష్టి
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు. ఎక్కడైనా బ్యాక్‌లాగ్ ఉన్నట్లు గుర్తిస్తే అదనపు నిల్వలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో ఎల్‌పీజీపై భారాన్ని తగ్గించేందుకు 'పైప్డ్ నేచురల్ గ్యాస్' (PNG) వినియోగాన్ని మరింత విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి వెల్లడించారు. వినియోగదారులు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
