Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
30 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లేదా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో ఇంధన సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న తప్పుడు ప్రచారం కారణంగా ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ అసత్య సమాచారం వల్ల తెలంగాణలో ఇంధన విక్రయాలు అకస్మాత్తుగా 100 శాతం పెరిగాయని ఆయన వెల్లడించారు. ఇటువంటి వదంతులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వినిపిస్తున్నాయని, అయితే సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 4,325 పెట్రోల్ బంకుల్లో కేవలం 106 చోట్ల మాత్రమే రవాణా, చెల్లింపుల సమస్యల వల్ల తాత్కాలికంగా నిల్వలు నిలిచిపోయాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఇంధన ధరలు పెరగబోతున్నాయనే తప్పుడు వార్తల వల్లే ప్రజలు నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మా వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయి. పెట్రోలియం కంపెనీలతో పరిస్థితిని సమీక్షించాను. ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పెట్రోల్ వంటి మండే స్వభావం గల పదార్థాలను ఇళ్లలో భద్రపరచడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కూడా నిలకడగా ఉందని, ఎక్కడా అంతరాయం కలగలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం, చమురు సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. ఇంధన సరఫరా, ధరల విషయంలో కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

వదంతులు నమ్మవద్దు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇంధన సంబంధిత ఫిర్యాదుల కోసం 1967 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

పౌరసరఫరాల శాఖ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఎక్కడా అంతరాయం కలగకుండా సాధారణ స్థాయి కంటే అధికంగా ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. పెట్రోలు సరఫరా 132 శాతం, డీజిల్ సరఫరా 210 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. కేవలం ఒకే రోజులో 36,404 కిలోలీటర్ల ఇంధనాన్ని సరఫరా చేయడంతో పాటు 3,817 ట్యాంకర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని అధికారులు సూచించారు.