Let's talk: editor@tmv.in
కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు : మార్గని భరత్

కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు : మార్గని భరత్

Panthagani Anusha
2 మే, 2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. “మాటలు తప్ప చేతలు లేవు” అని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్పా ఆదినారాయణ, సిటీ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటినుంచే శ్రామికులు, రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా పని చేశామని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019–2024 మధ్య పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు.

అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో “సూపర్ సిక్స్” హామీలు, 40 ఏళ్ల అనుభవం వంటి నినాదాలతో ప్రజలను ఆకర్షించిందని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో నిరాశ కలిగించిందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ఈ రెండేళ్లలో అప్పులు పెరిగాయని కానీ ఆ నిధులు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడలేదని విమర్శించారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో సౌకర్యాల లేమితో ఉన్న ఆసుపత్రిని వైసీపీ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసిన ఘనత తమదేనని కేంద్ర కార్మిక శాఖతో సమన్వయం చేసి ఈ అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు.

అదేవిధంగా శ్రామిక భవన్ నిర్మాణం వైసీపీ హయాంలో ప్రారంభమై కొంతవరకు పురోగతి సాధించిందని అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల కార్మికుల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విమర్శించారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణంలో తన కృషి ఉందని పేర్కొన్న భరత్ రామ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం అభివృద్ధి పనులు మందగించాయని సర్వీస్ రోడ్లు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇక గోదావరి గట్టు అభివృద్ధి, ఫ్లైఓవర్‌పై హడావుడిగా ఫ్లెక్సీలు పెట్టడం తప్ప వాస్తవ అభివృద్ధి పనులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల నగర అభివృద్ధి నిలిచిపోయిందని భరత్ రామ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ మేడపాటి షర్మినార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.