
బాసర ఆలయంలో చోరీకి 'రేవంతుద్దీన్' ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: బీజేపీ
నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పురాతన క్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. ఆలయ ఆవరణలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీ నగదును దుండగులు దోచుకెళ్లడంపై బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
ఈ ఘటనకు ‘రేవంతుద్దీన్’ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ బీజేపీ ఆరోపించింది. దేవాలయానికి, దేవుడి సొమ్ముకే రక్షణ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక సామాన్య పౌరుడికి ఏమి భరోసా ఇస్తుందని ఘాటుగా ప్రశ్నించింది. ఇది కేవలం సాధారణ చోరీ కాదు... కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలపై, నమ్మకంపై జరిగిన దాడి. గుడి హుండీకే గండి కొట్టేంత ధైర్యం దొంగలకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఖచ్చితంగా అధికారుల వైఫల్యం, రేవంతుద్దీన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? అని బీజేపీ ప్రశ్నించింది.
హిందువుల మనోభావాలను, ఆలయ భద్రతను పూర్తిగా గాలికొదిలేసిన ఈ నిర్లక్ష్యపు ప్రభుత్వానికి అసలు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని బీజేపీ విమర్శించింది. ప్రముఖ పుణ్యక్షేత్రంలోనే ఈ తరహా భద్రతా లోపాలు బయటపడటంపై భక్తులు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
