Let's talk: editor@tmv.in
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర

గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర

Gaddamidi Naveen
8 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని కల్లుగీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతి, తాటి ఉత్పత్తుల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం రంపచోడవరం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘నీరా ప్రోత్సాహం – తాటి ఉత్పత్తుల అభివృద్ధి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే ‘తాడి బోర్డు’ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. అరకు కాఫీ తరహాలోనే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ పానీయమైన ‘నీరా’ కు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తీసుకువస్తామన్నారు. నిడదవోలు, పందిరిమామిడి కేంద్రాల్లో ఆధునిక సాంకేతికతతో తాటి బెల్లం తయారీని విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, గీత కార్మికులకు వైన్ షాపుల్లో 10 శాతం కేటాయింపు ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని 1986లో ఏర్పాటు చేశారని గుర్తుచేసిన మంత్రి, ఆధునిక సాంకేతికతతో తాటి బెల్లం తయారీ జరుగుతోందని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు కల్లుగీత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ.. కల్లు నుంచి నీరా ఉత్పత్తిని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు పంచదారకు బదులుగా తాటి బెల్లం వాడాలని సూచిస్తూ, జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న తాడి చెట్లపై సమగ్ర సర్వే నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ ఏర్పాటు చేసిన తాటి బెల్లం, నీరా, తాటి తాండ్ర, తాటి ముంజలు, తాటి ఆకులతో చేసిన హస్తకళల ప్రదర్శన స్టాళ్లను, తయారీ యంత్రాలను పరిశీలించారు. ఈ ఉత్పత్తుల సాగు విస్తరణ, విలువ ఆధారిత మార్కెటింగ్ ద్వారా తాడి రైతులు, కల్లుగీత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ సిహెచ్. శ్రీధర్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
KolluRavindraAndhraPradeshAPGovernmentNeeraPalmProductsPalmJaggeryToddyTappersRuralDevelopmentFarmersWelfareValueAdditionTribalDevelopment
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర - Tholi Paluku