Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ఉద్యమంలా చేపట్టాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ఉద్యమంలా చేపట్టాలి: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
20 మే, 2026

రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి విద్యుత్ వాహన తయారీ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈవీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎం సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు వీలుగా రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి తొలి విడతగా 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల క్షేత్రస్థాయి సిబ్బందికి రవాణా సులభతరం కావడమే కాకుండా ప్రభుత్వంలో ఇంధన సంరక్షణ పట్ల స్పష్టమైన సందేశం వెళ్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ వాహనాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక ఆర్థిక వెసులుబాటును కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికోసం తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆర్థిక భారం పడకుండా ఈవీ సైకిళ్లను సులభమైన నెలవారీ వాయిదాల (ఈఎంఐ) పద్ధతిలో కొనుగోలు చేసేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఈవీల వాడకాన్ని పెంచడంతో పాటు వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. కేవలం వాహనాల పంపిణీకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని ఇందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. మౌలిక వసతుల కల్పనలో ఈవీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.