Let's talk: editor@tmv.in
మే నుంచి 'ఎల్ నినో' ముప్పు.. వేడెక్కనున్న భూగోళం!

మే నుంచి 'ఎల్ నినో' ముప్పు.. వేడెక్కనున్న భూగోళం!

Shaik Mohammad Shaffee
25 ఏప్రిల్, 2026

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచి 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) సంచలన ప్రకటన చేసింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో పాటు, వర్షపాత సరళిలో తీవ్ర వ్యత్యాసాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఏమిటీ ఎల్ నినో?

పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కాలానుగుణంగా పెరగడాన్ని 'ఎల్ నినో' అని పిలుస్తారు. ఇది సాధారణంగా 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి 2 నుండి 7 ఏళ్లకోసారి సంభవించే ఈ వాతావరణ మార్పు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే నెల నాటికి ఎల్ నినోగా మారి, రాబోయే నెలల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ నిపుణుడు విల్ఫ్రాన్ మౌఫౌమా ఓకియా స్పష్టం చేశారు.

నిప్పులు చెరగనున్న భానుడు

మే-జూన్-జూలై నెలల్లో ప్రపంచవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య అమెరికా, కరేబియన్ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే వేడి గాలులు వీచే సూచనలు ఉన్నాయి.

భారత్‌లో తగ్గనున్న వర్షాలు

ఈ ఏడాది 'ఎల్ నినో' ప్రభావం వల్ల మన దేశంలో వర్షాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల వల్ల ఏర్పడే ఈ మార్పుల కారణంగా, జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయి. గత మూడేళ్లుగా వానలు బాగానే పడినప్పటికీ, ఈసారి మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. దీనివల్ల సాగు నీరు అందక, పంటలు పండక రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో సాధారణంగా కురిసే 87 సెం.మీ. వర్షపాతాన్ని వాతావరణ శాఖ సాధారణంగా పరిగణిస్తుంది. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వానలు 8 శాతం తగ్గి, కేవలం 92 శాతానికే పరిమితం కానున్నాయని అంచనా. అంటే గడిచిన 50 ఏళ్ల సగటు కంటే ఈసారి వర్షాలు తక్కువగా పడనున్నాయి. ఇలా వానలు తగ్గడం వల్ల భూగర్భ జలాలు తగ్గి, సాగు నీరు అందక వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ఐఓడీతో స్వల్ప ఊరట

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో 'లా నినా' (చల్లని పరిస్థితులు) ముగిసి తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హిందూ మహాసముద్రంలో ఏర్పడే 'హిందూ మహాసముద్ర డయాపోల్' (ఐఓడీ) రుతుపవనాల రెండో సగభాగంలో అనుకూలంగా మారే అవకాశం ఉందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ తెలిపారు. ఇది కొంతవరకు వర్షాలకు తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, ఎల్ నినో ముప్పు మాత్రం పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి రాబోయే నెలల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.