Let's talk: editor@tmv.in
‘లాజికల్ డిస్క్రెపెన్సీ’ అనే పదం ఈసీ నిబంధనల్లో లేదు: మమతా

‘లాజికల్ డిస్క్రెపెన్సీ’ అనే పదం ఈసీ నిబంధనల్లో లేదు: మమతా

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో ఉపయోగిస్తున్న ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’ అనే పదం ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా అధికారిక వ్యవస్థలో గుర్తింపు పొందింది కాదని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విధానాన్ని బీహార్‌లో కాకుండా పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే అమలు చేసి బీజేపీకి లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. పశ్చిమ మిద్నాపూర్ జిల్లా పింగ్లా, పూర్బా మిద్నాపూర్ జిల్లా తమ్లుక్, హౌరా జిల్లా డోమ్‌జూర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళలకు పిలుపు

ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగితే మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అయితే హింసకు పాల్పడవద్దని కూడా ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బలగాల పని శాంతి భద్రతలు కాపాడటం. అందులో మాకు అభ్యంతరం లేదు. కానీ వారు ఓటర్లను అడ్డుకుంటే మహిళలు చేతుల్లో ఊతపట్టాలు పట్టుకుని ధైర్యంగా నిలబడాలి. హింసకు పిలుపు ఇవ్వడం లేదు, కానీ మీ హక్కులను కాపాడుకోవాలని ఆమె అన్నారు.

ఓటర్ల జాబితా వివాదం

ఓటర్ల హక్కులను రక్షించేందుకు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని తెలిపారు. ఆ తర్వాతే 32 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చారని ఆమె చెప్పారు.

కేంద్ర బలగాలపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్‌లో భారీగా కేంద్ర బలగాలను ఎందుకు మోహరించారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసుల అధికారాలను తగ్గించి ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రకృతి విపత్తులు లేదా అల్లర్ల సమయంలో ప్రజలకు కేంద్ర బలగాలు కనిపించవు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భారీగా వస్తున్నారుని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ సభలకు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రజలను తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే ఎన్నికల ముందు బూత్ ఏజెంట్లను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని కూడా ఆమె అన్నారు. దక్షిణ కొల్‌కతా జిల్లా ఎన్నికల అధికారి సోషల్ మీడియా పోస్టులో ‘బర్నాల్’ ‘బోరోలిన్’ అనే పదాలు ఉపయోగించిన విషయంపై కూడా మమతా స్పందించారు. “బర్నాల్ కాదు, మేము ఐస్‌క్రీమ్ ఇస్తాం. వేడి ఎక్కువగా ఉంది కాబట్టి చల్లగా ఉండండని ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీ ప్రతీకారం రాజకీయాలను నమ్మదని కూడా పేర్కొన్నారు.

కేంద్ర సంస్థలపై ఆరోపణలు

ఎన్నికల ముందు తృణమూల్ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మమతా ఆరోపించారు. ఈడీ, సీబీఐ అర్ధరాత్రి దాడులు నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. ఒక్కరిని అరెస్ట్ చేస్తే లక్షల మంది ముందుకు వస్తారు. ఒకరు లేకపోతే మరొకరు బాధ్యతలు చేపడతారు. పశ్చిమ బెంగాల్‌ను నియంత్రించడం అంత సులభం కాదని ఆమె పేర్కొన్నారు.