Let's talk: editor@tmv.in
2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
23 మే, 2026

మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, బ్యాంకుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిశోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ మోహన్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వివరిస్తూ, ప్రస్తుత దేశ సగటు వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంటే, తెలంగాణ 10.7 శాతం అద్భుత వృద్ధి రేటుతో దూసుకుపోతోందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. అలాగే దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన గర్వంగా వెల్లడించారు. ఈ గణాంకాలను బట్టి 3 ట్రిలియన్ల లక్ష్యం ఖచ్చితంగా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరాయని, క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదు కావడం అద్వితీయమని కొనియాడారు. రూ.1,65,297 కోట్ల వ్యవసాయ రుణాల లక్ష్యానికి గాను రూ.1,68,401 కోట్లు పంపిణీ చేసి 101.88 శాతం ప్రగతి సాధించడం పట్ల బ్యాంకర్లను అభినందించారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలోని మహిళా సంఘాలకు యుద్ధప్రాతిపదికన రుణ పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా నగరంలోని మురికివాడల్లో ఉండే యువ మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని బ్యాంకులకు సూచించారు.

విద్యార్థుల రుణాలు భవిష్యత్ పెట్టుబడులు

విద్యార్థులకు ఇచ్చే విద్యా రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని భట్టి విక్రమార్క కోరారు. విద్యార్థులకు ఇచ్చే రుణాలు కేవలం అప్పులు కావని, అది దేశ యువతపై మనం పెట్టే "భవిష్యత్ పెట్టుబడి" అని ఆయన అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లుగా పరుగెత్తించవచ్చని ప్రభుత్వం చేతల్లో నిరూపించిందన్నారు.

ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతున్న తరుణంలో, తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా సౌరశక్తి విభాగంలో స్థిరమైన ప్రగతిని సాధిస్తోందని పేర్కొన్నారు. సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో పాటు మహిళా, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీ పెంచాలన్నారు.

వ్యూహాత్మక భాగస్వాములుగా బ్యాంకులు

బ్యాంకులు కేవలం డిపాజిట్లు, రుణాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జీఎస్‌డీపీకి, ఉపాధి కల్పనకు ఏ రంగం ఎక్కువ దోహదపడుతుందో ఆలోచించి బ్యాంకులు వ్యూహాత్మకంగా రుణాలు అందించాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలలో ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకువచ్చి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు. వీటితో పాటు మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ పనులను వేగంగా పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, దీనివల్ల సేవల రంగానికి భారీ అవకాశాలు ఉంటాయని డిప్యూటీ సీఎం వివరించారు.